PM Narendra Modi on National Education Policy: దేశంలో పేద, వెనకబడిన వర్గాలకు ఉన్నత విద్యను చేరవేసేందుకు, మరింత సరళీకృతం చేయడంలో భాగంగా ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గడిచిన ఏడాదిగా ఉపాధ్యాయుడు, ప్రిన్సిపల్స్, మేధావులు, ప్రజా ప్రతినిధులు చాలా కృషి చేశారని మోడీ పేర్కొన్నారు.
జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఇంజినీరింగ్ కోర్సులను ఐదు స్థానిక భాషల్లో బోధించనున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతున్నట్లు ఆయన తెలిపారు. తొలుత హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ఉంటుందని చెప్పారు. ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కొత్త విధానం దోహదపడుతుందని, దీంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మన యువతకి ఏ విధమైన విద్యను అందిస్తున్నామనే దానిపైనే..భవిష్యత్తులో మనం ఎంత వరకు వెళ్లగలం,ఎన్ని ఉన్నత శిఖరాలను మనం అధిరోహించగలమేది ఆధారపడి ఉంటుందన్నారు మోడీ. కొత్త జాతీయ విద్యా విధానం..దేశ నిర్మాణం యొక్క గొప్ప త్యాగంలో ఒక పెద్ద కారకంగా ఉంటుందన్నారు. మార్పు తీసుకువచ్చేందుకు మన యువత సిద్ధంగా ఉన్నారన్నారు. మొత్తం పరిస్థితిని కోవిడ్ ఏ విధంగా మార్చేసిందనేదని.. కానీ విద్యార్ధులు ఈ పరిస్థితులను వెంటనే అందిపుచ్చుకున్నారని, ఆన్ లైన్ విద్య ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డేగా మారుతుందన్నారు. ప్రతి ఒక్క రంగంలో తమ సత్తా చూసేందుకు భారతీయ యువత ముందుకెళ్తున్నారన్నారు. ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ని విప్లవాత్మకమైనదిగా చేస్తున్నారని అన్నారు. డిజిటల్ మీడియాకు కొత్త రెక్కలు ఇస్తున్నారన్నారు. ఇండస్ట్రీ 4.0కి భారత నాయకత్వం ఇచ్చేందుకు యువత సిద్ధమవుతుందని మోడీ తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే మహాయజ్ఞంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఈ-లెర్నింగ్ పోర్టల్ ‘దీక్ష (DIKSHA)’ గురించి ప్రస్తావించిన మోడీ.. నిత్యం దాదాపు ఐదు కోట్ల హిట్స్ సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాదిలో మొత్తం 2300 కోట్ల వీక్షణలు వచ్చాయని తెలిపారు. దేశ యువత మార్పుకు సిద్ధంగా ఉన్నారని, వారిని కలలను నేరవేర్చడానికి ఈ దేశం వారికి అండగా ఉంటుందని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. అలాగే, మొదటిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కి లాంగ్వేజ్ సబ్జెక్ట్ హోదా ఇచ్చినట్లు మోడీ తెలిపారు. ఇకపై విద్యార్ధులు దీన్ని ఒక భాషగా కూడా చదవగలరన్నారు. మన దివ్యాంగ సహచరులకు ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.
I am particularly delighted that the National Education Policy celebrates India’s linguistic diversity. #TransformingEducation pic.twitter.com/cIktCwz0CF
— Narendra Modi (@narendramodi) July 29, 2021