Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు.. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలని ఆదేశం..

సోరెన్ సహాయకుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. సాహిబ్‌గంజ్‌లో జరిగిన దాడిలో పంకజ్ మిశ్రా ఇంటి నుండి ఈడీ చేతిలో ఒక కవరును గుర్తించింది. దీని మూలాలు ముఖ్యమంత్రికి కనెక్ట్ అవుతున్నాయి.

Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు.. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలని ఆదేశం..
Hemant Soren

Updated on: Nov 02, 2022 | 10:07 AM

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఈడీ) సమన్లు ​​పంపింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి పీఎంఎల్‌ఏ కేసులో ఈ సమన్‌ పంపబడింది. గురువారం హేమంత్ సోరెన్‌ను విచారణకు పిలిచారు. ఈ కేసులో సోరెన్ సహాయకుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. సోరెన్ సహచరుడు పంకజ్ మిశ్రా, అతని వ్యాపార సహచరులతో సంబంధం ఉన్న జార్ఖండ్‌లోని 18 ప్రదేశాలపై దర్యాప్తు సంస్థ జూలై 8న దాడులు చేసింది.

ఏం జరిగిందంటే..

ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ గతంలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ టైమ్‌లో కొన్ని లీజుల మంజూరు, సొంతంగా గనులు కేటాయించుకోవడంలో అక్రమాలకు పాల్పడ్డారనేది అభియోగం. కొన్నాళ్లుగా దీనిపై వివాదం కొనసాగుతుండగానే విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రాంచీలోని కార్యాలయానికే రావాలని సూచించింది. సీఎం హేమంత్ సోరెన్ నేరుగా విచారణకు రావాల్సిన పరిస్థితుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ పోలీసులకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు లేఖ రాశారు. 42 కోట్లకుపైగా ఆస్తుల్ని ఈ మైనింగ్‌ లీజుల ద్వారా అక్రమంగా సంపాదించారంటూ సోరెన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్  అధికారితోపాటు సోరెన్ సన్నిహితుల్ని కూడా ఈ కేసులో చిక్కులు ఎదుర్కొంటున్నారు.

సీఎం పదవి నుంచి తప్పిస్తారంటూ..

ఈ మైనింగ్‌ కేసు హేమంత్‌ మెడకు చట్టుకోవడం ఖాయమని, ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పిస్తారంటూ కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్-9A ప్రకారం సీఎం సోరెన్ నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది. సీఎంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల బలపరీక్షకు వెళ్లిన సోరెన్ అందులో నెగ్గారు. అయినా ఈ మైనింగ్‌ కేసు ఆయన్ను వెంటాడుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే జార్ఖండ్‌ గవర్నర్‌ రమేష్‌ బైస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఆటం బాంబ్‌ పేలుతుందంటూ కామెంట్‌ చేశారు. సీఎం హేమంత్‌ సోరెన్‌ అనర్హత వేటుపై రెండో అభిప్రాయం కోరినట్టు గవర్నర్‌ చెప్పారు. ఆటంబాబు పేలుతుందని ఆయన అనడం.. వారం రోజులకే ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

హేమంత్ సోరెన్‌కి సమన్లు ​​పంపడానికి కారణం?

సాహిబ్‌గంజ్‌లో జరిగిన దాడిలో, పంకజ్ మిశ్రా ఇంటి నుండి ఈడీ ఒక కవరును కనుగొన్నారు. మీడియా కథనాల ప్రకారం, ఈ కవరులో ముఖ్యమంత్రి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన చెక్‌బుక్ ఉంది. ఇందులో రెండు చెక్కులపై సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు ప్రేమ్ ప్రకాష్ ఇంటి వద్ద నుంచి ముఖ్యమంత్రి నివాసానికి భద్రత కోసం మోహరించిన జవాన్లకు కేటాయించిన రెండు ఏకే 47, 60 బుల్లెట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో, పంకజ్ మిశ్రా రిమ్స్‌లో చేరిన సమయంలో, ముఖ్యమంత్రి పేరుతో అధికారులతో ఫోన్‌లో మాట్లాడి భయపెట్టిన ఆధారాలను కూడా ఈడీ గుర్తించింది. అక్రమ మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి పేరుతో జిల్లా అధికారులను పంకజ్ మిస్రీ, అతని సహచరులు బెదిరించేవారని ఈడీకి ఆధారాలు లభించాయి.

అక్రమ మైనింగ్ కేసు

పంకజ్ మిశ్రాతోపాటు ఇతరులపై ఈ ఏడాది మార్చిలో ఈడీ పిఎంఎల్‌ఎ ఫిర్యాదును దాఖలు చేసింది. వారు తమకు అనుకూలంగా భారీ ఆస్తులను అక్రమంగా సంపాదించారని పేర్కొన్నారు. దీని తరువాత, ఈడీ దాడులు నిర్వహించి, మిశ్రాకు చెందిన 37 బ్యాంకు ఖాతాలలో జమ చేసిన రూ. 11.88 కోట్లను స్తంభింపజేసింది. ప్రభుత్వ ఏజెన్సీ కూడా రూ. 5.34 కోట్ల విలువైన ఖాతాలో లేని కరెన్సీ ని స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బు జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌కు సంబంధించినదని ఈడీ పేర్కొంది. దీంతోపాటు అక్రమంగా నిర్వహిస్తున్న ఐదు స్టోన్ క్రషర్లు, అంతే సంఖ్యలో అక్రమ గన్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు, దర్యాప్తు సంస్థ ఈడీ పంకజ్ మిశ్రాను 2022 జూలై 19న, బచ్చు యాదవ్‌ను ఆగస్టు 4న, ప్రేమ్ ప్రకాష్‌ను ఆగస్టు 25న అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లా బర్హర్వా పోలీస్ స్టేషన్‌లో ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద పంకజ్ మిశ్రాతోపాటు ఇతరులపై ఇడి మనీలాండరింగ్ విచారణను ప్రారంభించింది. తరువాత, ఐపిసి, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం కింద నమోదైన అక్రమ మైనింగ్‌కు సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు కూడా షెడ్యూల్డ్ నేరాల పరిధిలోకి తీసుకోబడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం