Elon Musk: ఆస్పత్రి నిర్లక్ష్యంతో భారత సంతతి వ్యక్తి మృతి.. స్పందించిన ఎలాన్ మస్క్

కెనడాలో ఓ ఆస్పత్రి ఆలస్యంగా చికిత్స అందించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. దీనిపై ఎలాన్ మస్క్‌తో పాటు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Elon Musk: ఆస్పత్రి నిర్లక్ష్యంతో భారత సంతతి వ్యక్తి మృతి.. స్పందించిన ఎలాన్ మస్క్
Elon Musk

Updated on: Dec 28, 2025 | 6:00 PM

భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి కెనడాలో అస్పత్రి నిర్లక్ష్యం వల్ల మరణించడంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించాడు. ఈ సందర్భంగా కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. భారత ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

భారత సంతతికి చెందిన 44 ఏళ్ల ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి కెనడాలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ హాస్పిటల్‌కు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12.20 గంల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయిటింగ్ ఏరియాలోనే ఉంచారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. రక్తపోటు 210కి పెరిగినా.. ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. చాతీనొప్పి తీవ్రస్థాయిలో లేదని చెబుతూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వెయిటింగ్ హాల్‌లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. కొన్ని సెకన్లలోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మరణించాడు.

కెనడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఎలాన్ మాస్క్ ఎక్స్‌లో మండిపడ్డారు. “ప్రభుత్వం వైద్య సంరక్షణ చేసినప్పుడు, అది DMV (మోటారు వాహనాల విభాగం) లాగానే మంచిది అంటూ విమర్శించారు. కెనడా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చడం ద్వారా విమర్శించారు.