మైసూరు దసరా ఉత్సవాల్లో చాముండేశ్వరి దేవి ని బంగారు అంబారీలో మోసుకుని రాజబీడీ వీధుల్లో నడిచే బలరాముడు అనే వృద్ధ ఏనుగు (67) కన్నుమూసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న బలరాముడు ఆదివారం మరణించింది. ఉత్సవాల్లో ఇప్పటి వరకు 14సార్లు బంగారు అంబరాన్ని మోసిన బలరాముడికి నోటిలో పుండు వచ్చింది. బలరాముడు గత పది రోజులుగా నొప్పితో బాధపడుతూ, తినడానికి ఇబ్బంది పడ్డాడు. ఆహారం తీసుకోలేదని నీళ్లు మాత్రమే తాగడం వల్ల అనారోగ్యానికి గురైనట్లుగా డాక్టర్లు తెలిపారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆదివారం బలరాముడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నాగర్‌హోళే పార్క్‌లోని హుణసూరు పరిధిలోని భీమనకట్టె ఏనుగుల శిబిరంలో చికిత్స అందించినప్పటికీ చికిత్స విఫలమై తుదిశ్వాస విడిచాడు.
నోట్లో పుండ్లు కారణంగా బలరాముడికి ఘనపదార్దాలకు బదులుగా మినుము గంజి, మినుము పిండి, అరటి పండు, పుచ్చకాయ పండు వంటి ఆహారాన్ని అందించారు. ఏనుగు హెల్త్ కండీషన్ తెలుసుకునేందుకు ఎండోస్కోపీ కూడా చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ఊరేగింపులో జంబూసవారి సమయంలో ముందుండి ఏనుగుల బృందానికి సారధ్యం వహించాడు బలరాముడు. కర్నాటకలోని కొడగు ప్రాంతంలో సోమవారపేట సమీపంలోని కట్టేపూర్ అడవుల్లో 1987లో బలరాముడు పట్టుబడ్డాడు. తర్వాత శిక్షణ ద్వారా మచ్చిక చేసుకున్నారు. బలరాముడు 20 ఏళ్లుగా దసరా వేడుకల్లో పాల్గొంటున్నాడు. ద్రోణుడి తర్వాత అంబారీ మోయడానికి బలరాముడు ఎంపికయ్యాడు. అయితే అంబారీ మోయడానికి బలరాముడు మొదటి ఎంపిక కాదు. 5,600 కిలోల బరువున్న అర్జున అనే ఏనుగు ప్రమాదవశాత్తు ఒక మావటిని చంపినందుకు అంబరీని మోసే అవకాశం కోల్పోయింది. అలా బలరాముడు ఎంపికయ్యాడు. దీంతో బలరాముడు 1999 నుండి 2011 మధ్య 13 సంవత్సరాల పాటు దసరా ఊరేగింపులో చాముండీశ్వరి దేవి బంగారు అంబరాన్ని మోసుకొచ్చాడు. బలరాముడు 4590 కిలోగ్రాముల బరువు.. 2.70 మీటర్ల పొడవు, 3.77 మీటర్ల ఎత్తు.. తొండం బాగా పొడవుగా ఉంటుంది.
బలరాముడి బరువు తగ్గడంతో విశ్రాంతి ఇచ్చారు. దీంతో బలరాముడి తర్వాత భారాన్ని మోయడానికి అర్జునుడు ఎంపికయ్యాడు. బలరాముడు ప్రధాన ఏనుగుగా ఊరేగింపును ముందుండి నడిపించాడు.
మహాత్మునికి బలరాముడు సర్వస్వం
మావటి మహాత్ముడి సూచనలను తప్పకుండా పాటించే వాడు బలరాముడు. అతను తప్ప ఎవరూ ఆహారం ఇచ్చినా తినేవాడు కాదు. తన గంభీరమైన రూపం, తన ప్రశాంతమైన స్వభావంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..