భారత్‌లోని ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జనాలకు అంతరిక్షానికి సంబంధించిన విషయాలపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. చాలామంది అంతరిక్షం గురించి అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. వారికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. గూగుల్‌లో వారికి తలెత్తుతున్న అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిలా ఉండగా అంతరిక్షానికి సంబంధించిన చాలా అపోహలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీటిలో ముఖ్యంగా ఒక సందేహం జనంలో గట్టిగా ఉండిపోయింది. అదేంటంటే అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి వృద్ధాప్యానికి చేరుకోడు.. యవ్వనునిగానే ఉండిపోతాడనే ప్రచారం ఉంది. సినిమాల్లో కూడా వీటిని చూపిస్తుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.
గడచిన కొన్ని దశాబ్దాలుగా కొన్నిదేశాలు తమ వ్యోమగాములను స్పేస్‌లోకి పంపాయి. వారు అంతరిక్షంలో కొన్ని రోజులు గడిపి.. అలాగే అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అలాగే అంతరిక్షం నుంచి తిరిగొచ్చినటువంటి వ్యోమగాములలో కొన్ని మార్పులు కూడా కనిపించాయి. అయితే వాటికి సంబంధించిన అధ్యయనాన్ని నాసా చేపట్టింది. అంతరిక్షం నుంచి తిరిగివచ్చిన వారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించింది. అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములలో రక్తహీనత రావడం అనేది సర్వసాధారణం. దీన్నే స్పేస్ అనీమియా అని అంటారు. ఇక అసలు విషయానికి వస్తే అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వారి వృద్ధాప్యం నిజంగానే నెమ్మదిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. అయితే ఇందుకోసం నాసా ఒక పరీక్ష చేసింది. ఇందులో పరిశోధకులు ఇద్దరు కవల సోదరులను ఎంపికచేశారు. వారిద్దరూ కూడా వ్యోమగాములు. వారిలో ఒకరిని అంతరిక్షంలోకి పంపారు. మరొకరిని భూమిపైనే ఉంచారు. స్కాట్ కెల్లీ 340 రోజుల పాటు అంతరిక్షంలో గడిపాడు. అతని కవల సోదరుడు మాత్రం మార్క్ భూమిపైనే ఉన్నాడు.
అయితే స్కాట్ కెల్లీ అంతరిక్షం నుండి భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు, అతని జన్యువులలో చాలా మార్పులు జరిగాయని పరిశోధకులు గుర్తించారు. భూమిపై జరగని కొన్ని మార్పులు అతని డీఎన్‌ఏలో కనిపించాయని తెలిపారు. స్కాట్ తన సోదరుడు మార్క్ కంటే చిన్నవాడిగా కనిపించడానికి ఇదే కారణంగా కూడా నిలిచింది. అయితే మళ్లీ 6 నెలల తర్వాత స్కాట్ కెల్లీ జీన్స్‌లో మార్పు సాధారణ స్థితికి వచ్చేసింది. అయితే దీని ప్రకారం చూస్తే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వారి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా వారు యవ్వనులుగా కనిపించేందుకు కూడా అనేక అవకాశాలున్నట్లు తేలింది.