Medical Negligence: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యుల ఆమె కడుపులోనే కాటన్ పెట్టి కుట్లు వేశారు. ఆ తర్వాత ఆమెకు కడుపునొప్పి రాగా.. వైద్యులను సంప్రదిస్తే సాధారణ కడుపునొప్పి అంటూ ఇంటికి పంపారు. చివరకు ఆమె కడుపులో కాటన్ ఉన్నట్లు ఏపీలోని విశాఖపట్నం వైద్యులు గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారు. ఒడిశా (Odisha) లోని కోరాపుట్ జిల్లా బిరిగుడ గ్రామానికి చెందిన హలబ అనే మహిళకు కడుపునొప్పి రాగా.. ఆమెను రాయగడ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం మీటర్ పొడవున్న కాటన్ ఆమె కడుపులోనే వదిలేసి వైద్యులు కుట్లు వేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాధితురాలికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆపరేషన్ చేసిన ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అప్పుడు కూడా ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఇది సాధారణ కడుపు నొప్పని చెప్పి పంపారు. అయితే.. నొప్పి తీవ్రం కావడంతో బాధితురాలు మరో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా.. మీటరు పొడవైన కాటన్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.
దీంతో ఆమెను కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఆపరేషన్ చేసి వైద్యులు కాటన్‌ను తొలగించారు. అయితే రాయగడ వైద్యుల నిర్లక్ష్యంతో తమకున్న భూమి, బంగారాన్ని తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించామని బాధితురాలు కుటుంబం పేర్కొంది. కాగా.. వైద్యుల నిర్లక్ష్యంపై రాయగడ ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించగా దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు రాయగడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read: