India – Qatar: ఖతార్‌‌తో భారత్ ద్వైపాక్షిక బంధం ప్రాధాన్యత ఏంటో తెలుసా?

సౌదీ, ఖతార్ వంటి దేశాల్లో చిన్న చిన్న నేరాలకే భారీ శిక్షలుంటాయి. సామాన్యులకు పడే ఆ శిక్షల నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఇక ఒకసారి మరణశిక్ష పడితే అంతే. సామాన్యులకే పరిస్థితి ఇలా ఉంటే.. గూడచర్యం వంటి నేరంపై మరణశిక్షకు గురైనవారు బ్రతికి బయటపడడం అసలేమాత్రం సాధ్యం కాదు..

India - Qatar: ఖతార్‌‌తో భారత్ ద్వైపాక్షిక బంధం ప్రాధాన్యత ఏంటో తెలుసా?
India Qatar

Edited By:

Updated on: Feb 15, 2024 | 9:38 AM

భారతదేశ దౌత్య విధానాలు, తద్వారా సాధిస్తున్న విజయాలకు గూడచర్య నేరంపై మరణశిక్షకు గురైన 8 మంది భారత నేవీ మాజీ అధికారుల విడుదలే ఒక ఉదాహరణ. సౌదీ, ఖతార్ వంటి దేశాల్లో చిన్న చిన్న నేరాలకే భారీ శిక్షలుంటాయి. సామాన్యులకు పడే ఆ శిక్షల నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఇక ఒకసారి మరణశిక్ష పడితే అంతే. సామాన్యులకే పరిస్థితి ఇలా ఉంటే.. గూడచర్యం వంటి నేరంపై మరణశిక్షకు గురైనవారు బ్రతికి బయటపడడం అసలేమాత్రం సాధ్యం కాదని ఎవరైనా చెబుతారు. కానీ భారత్ ఈ విషయంలో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఖతార్‌తో భారత్ ఏర్పాటు చేసుకున్న బలమైన దౌత్య సంబంధాలు ఈ విషయంలో చాలా కీలకంగా మారాయి. అసలు భారతదేశానికి ఖతార్‌తో ఉన్న సంబంధాలేంటి? పరస్పరం అందించుకుంటున్న సహాయం ఏంటి?

ఉపాధి, వాణిజ్యం, వ్యాపారం.. అన్నింటా బలమైన బంధం

భారతదేశం దిగుమతి చేసుకుంటున్న ద్రవీకృత సహజవాయువు (లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ – LNG)లో 48% ఒక్క ఖతార్ నుంచే చేసుకుంటోంది. అలాగే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)లో 29% ఈ దేశం నుంచే దిగుమతి అవుతోంది. ఈ మధ్యనే సహజవాయు సరఫరా విషయంలో ఖతార్‌తో భారత్‌కు చెందిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ 78 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. ఆ మేరకు 2028తో ముగిసే సప్లై కాంట్రాక్ట్‌ను 2048 వరకు పొడిగించింది. వీటితో పాటు అనేక రకాల పెట్రోలియం రసాయనాలు, ప్లాస్టిక్, ఎరువులు వంటివి కూడా ఈ దేశం నుంచి పెద్ద మొత్తంలోనే దిగుమతి అవుతున్నాయి.

అంటే ఈ మేరకు ఆ దేశానికి ఆదాయాన్ని గడించి పెట్టడంతో భారత్ పాత్ర పెద్దదే అని అర్థమవుతోంది. ఇక ఆ దేశంలో 8,35,000 మంది భారతీయులు పని చేస్తున్నారు. ఇది ఖతార్ మొత్తం జనాభాలో 27 శాతం. ఇంజనీరింగ్, ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియాతో పాటు బ్లూ కాలర్ ఉద్యోగాలలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఖతార్‌లో మొత్తం 15,000 చిన్న, పెద్ద భారతీయ కంపెనీలున్నాయి. ఆ దేశంలో భారతీయ కంపెనీలు 450 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో ఖతార్ సైతం భారత్‌లో అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పరస్పరం సాగిస్తున్న ఈ పెట్టుబడులు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

పాలకుల పరస్పర పర్యటనలు..

ఖతార్‌తో నెలకొన్న వాణిజ్య, మధ్యప్రాచ్యంలో ఖతార్‌కు భారత్ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ప్రధాని మోదీ 2016 జూన్ 4-5 తేదీల్లో ఖతార్‌లో పర్యటించారు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 14-15 తేదీల్లో మరోసారి పర్యటిస్తున్నారు.

గతంలో 2008 నవంబర్‌లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఖతార్‌లో పర్యటించారు. ఖతార్ ‘ఎమిర్’ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ 2015లో భారతదేశాన్ని సందర్శించారు. అంతకు ముందు ఆయన తండ్రి. అప్పటి ఎమిర్ 1999, 2005, 2012లో భారతదేశాన్ని సందర్శించారు. భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, అంతకు ముందు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు పలువురు మంత్రులు ఖతార్‌లో పర్యటించారు.

మొత్తంగా భారత్, ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ స్థిరంగా బలపడుతున్నాయి. వాటిలో రాజకీయ సంబంధాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, విద్యుత్ రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోంది. అలాగే సాంస్కృతిక సంబంధాలు, విద్య, రక్షణ రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ ఖ్వాత్రా తెలిపారు. రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..