హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు మరోసారి ఊరట లభించింది. హర్యానా ప్రభుత్వం మరోసారి 50 రోజుల పెరోల్ ఇచ్చింది. ఈ పెరోల్ శుక్రవారం సాయంత్రం నుండి అమలులోకి వస్తుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. రామ్ రహీమ్ తన 29 రోజుల పెరోల్‌ను ఇంకా కొనసాగిస్తూనే ఈ పెరోల్ పొందారు. ఈ పెరోల్ సమయంలో, అతను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో ఉన్న తన బర్నావా ఆశ్రమంలో ఉంటారు. గత రెండేళ్లలో రామ్ రహీమ్ పెరోల్ పొందడం ఇది ఏడోసారి. ఇప్పటి వరకు మొత్తం 9 సార్లు జైలు నుంచి బయటకు వచ్చారు.
హర్యానాలోని జైలు నిబంధనల ప్రకారం, శిక్ష పడిన ఏ ఖైదీ అయినా సంవత్సరంలో 70 రోజులు పెరోల్ తీసుకోవచ్చు. బహుశా అందుకే మళ్లీ మళ్లీ జైలు నుంచి బయటకు వస్తున్నారు గుర్మీత్ రామ్ రహీమ్. అతని 50 రోజుల పెరోల్ దరఖాస్తుకు శుక్రవారం ఆమోదం లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు జైలు పరిసరాల్లో నిఘా పెంచారు. శివాజీ కాలనీ పోలీస్ స్టేషన్ ఔటర్ హిసార్ బైపాస్, రూపే చౌక్ నుండి IMMA వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. డీఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం అతడిని యూపీకి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
రామ్ రహీమ్‌కి ఇప్పటి వరకు 9 సార్లు పెరోల్ మంజూరైంది. మొదటిసారిగా, 24 అక్టోబర్ 2020న ఒక రోజు పెరోల్ పొందారు. ఈ సమయంలో, రామ్ రహీమ్ తల్లి అనారోగ్యంతో ఉందని, ఆమెను కలవడానికి వెళ్ళారు. అదేవిధంగా, రెండవసారి మే 21, 2021న, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి మరోరోజు పెరోల్ తీసుకున్నారు. మూడవసారి, అతనికి 7 ఫిబ్రవరి 2022న 21 రోజుల పెరోల్ లభించింది. నాల్గవసారి, అతనికి జూన్ 2022న ఒక నెల పెరోల్ దొరికింది.
ఇదిలావుంటే, ఇద్దరు సాధ్విలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో రామ్ రహీమ్‌కు 10 ఏళ్ల శిక్ష పడింది. దీంతో పాటు జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…