(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు బ్యూరో చీఫ్, ఢిల్లీ)
కోవిడ్-19 సెకండ్ వేవ్ కాస్త నిదానించడంతో హస్తినలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు, సంస్థాగతంగా అన్ని రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పటిష్టం చేసేకునే కసరత్తు జరుగుతుండగా, అధికారపక్షం కొత్త మిత్రులను వెతుక్కుంటూ అటు ఎన్డీయే కూటమిని, ఇటు కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో బలమైన నేతలుగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కసరత్తును చేపట్టగా, వీరికి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తోడవ్వడంతో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మోదీ-షా ద్వయాన్ని పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు వచ్చి కలిసి వెళ్తుండడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో ఓటమి, సెకండ్ వేవ్ సృష్టించిన విలయం అనంతరం దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టుకోవడంపై కమళదళం అగ్రనాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నాటికి మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టాలని మోదీ-షా ద్వయం కృతనిశ్చయంతో ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ జన సంఖ్య కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రమే కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ రాష్ట్రంలో సాధించిన మెజారిటీ కారణంగానే వరుసగా ఎన్డీయే రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగింది. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలంటే, అక్కడ మాత్రమే దిద్దుబాటు చర్యలు చేపడతే సరిపోదని కాషాయదళం భావిస్తోంది. అందుకే భారీస్థాయిలో పైనుంచి కింది వరకు మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇందులో జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ కీలకంగా మారింది.
కేబినెట్ ఖాళీల భర్తీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 2019లో రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎన్డీయే, రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంది. అయితే ఈ రెండేళ్లలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వపక్ష, మిత్రపక్ష నేతల మరణాలు, దూరమైన మిత్రుల కారణంగా కేబినెట్లో ఖాళీలు ఏర్పడ్డాయి. కోవిడ్ తొలి వేవ్‌లో కేంద్ర మంత్రిగా ఉన్న సురేశ్ అంగడి చనిపోగా, అనారోగ్య కారణాలతో మిత్రపక్షం లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ మృతి చెందారు. బీజేపీతో విబేధాల కారణంగా శివసేన తొలుత దూరమవగా, గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా దూరమైంది. అలా మొత్తమ్మీద నేతల మరణాలు, మిత్రపక్షాల విడాకుల కారణంగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేయక తప్పని పరిస్థితి నెలకొంది.
Also Read.. బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌పై నో ట్యాక్స్.. కొవిడ్ వ్యాక్సిన్లపై మాత్రం 5% జీఎస్టీ..
రాజకీయ సమీకరణాలు – అనివార్యతలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రంలో చోటు కల్పిస్తామని నాయకత్వం హామీ ఇచ్చినట్టు సమాచారం. కొత్తగా చేపట్టే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సింధియాకు తప్పనిసరిగా చోటు కల్పిస్తారని భారతీయ జనత పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వరుసగా రెండోసారి విజయాన్ని సాధించిపెట్టిన అస్సాంలో కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించడంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కూటములను ఏర్పాటు చేసి అధికారాన్ని సైతం చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకు అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మకు ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించాలని అధినాయకత్వం భావించింది. ఈ క్రమంలో రెండోసారి పార్టీని గెలిపించినా సరే.. సీఎం పదవిని శర్బానంద సోనోవాల్ త్యాగం చేయాల్సి వచ్చింది. సీఎంగా అస్సాం వెళ్లడానికంటే ముందు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన సోనోవాల్‌ను, ఇప్పుడు మళ్లీ కేబినెట్లోకి తీసుకోనున్నట్టుగా కమలదళ నేతలు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌ను తప్పించిన పార్టీ అధిష్టానం పార్లమెంటు సభ్యుడైన తీర్థ్ సింగ్ రావత్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టింది. దీంతో త్రివేంద్ర సింగ్ రావత్‌కు కేంద్రంలో చోటు కల్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఢిల్లీలో వరుసపెట్టిన అధిష్టానం పెద్దలను కలుస్తుండడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది.
వీటన్నింటి కంటే బీజేపీ నాయకత్వానికి బిహార్ నుంచి ఒక అనివార్యత ఉంది. జేడీ(యూ)-బీజేపీ జట్టుకట్టి అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, రెండు పార్టీల నేతలూ ప్రభుత్వంలో ఉన్నారు. కానీ జేడీ(యూ)కు కేంద్రంలో మాత్రం చోటు లేదు. ఎన్డీయే-2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో తమకిచ్చిన మంత్రి పదవుల సంఖ్య, శాఖల విషయంలో జేడీ(యూ) అసంతృప్తిగా ఉండి, కేబినెట్లో చేరకుండా మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని జేడీ(యూ)కు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ఇచ్చి కొంతమేర మిత్రపక్షాన్ని శాంతింపజేసిన ఏన్డీయే నాయకత్వం, ఇప్పుడు జరగబోయే కేబినెట్ విస్తరణలో సముచిత స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రంలో ఎంతో కొంత ఓటు బ్యాంకు కలిగిన అప్నాదళ్‌కు కూడా కేబినెట్లో బెర్త్ ఖరారు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా ఈ మధ్య అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
బ్యూరోక్రాట్ బాబులకూ ఛాన్స్
బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి వచ్చి గెలిచి, మంత్రులుగా మారడం సాధారణంగా జరుగుతుంటుంది. ఒక్కోసారి ఆయా రంగాల్లో వారికున్న విశేష అనుభవాన్ని ఉపయోగించుకోవడం కోసం నిపుణులను తీసుకొచ్చి మంత్రులుగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఇప్పటికే పలువురు సివిల్ సర్వీసెస్ అధికారులను వెతికిపట్టుకొచ్చి మరీ మంత్రులుగా చేసింది. ఈ సారి జరపబోయే విస్తరణలోనూ మరికొందరు బ్యూరోక్రాట్ బాబులకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని, వాటిని ఆయా రంగాల్లో నైపుణ్యం, అనుభవం కలిగిన మాజీ అధికారులు లేదా నిపుణులతో భర్తీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read..కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలి.. కేంద్రాన్ని కోరిన జీఎస్టీ కౌన్సిల్
ఆంధ్రప్రదేశ్‌కు బెర్త్!
ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్లో చోటు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటి కోడలైన నిర్మల సీతారామన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, ఆమె కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పొరుగునే ఉన్న తెలంగాణలో 4 సీట్లు గెలుపొందిన బీజేపీ, ఏపీలో మాత్రం ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ నేరుగా బీజేపీ నుంచి గెలుపొందినవారేమీ కాదు. అయితే ఈసారి విస్తరణలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొత్తవారికి కేబినెట్లో చోటు కల్పిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ నుంచి మంత్రయ్యే అవకాశం ఎవరికి ఉందనే చర్చ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ కి చెందినప్పటికీ, ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ సమీకరణాలు, లెక్కల సంగతెలా ఉన్నా, కొత్తగా కేంద్ర కేబినెట్లో ఎవరికి బెర్తు దొరుకుతుందనే విషయంలో చివరి నిమిషం వరకు ఎవరూ ఊహించలేరని, మోదీ-షా ద్వయం మదిలో ఏముందో ఎవరూ గ్రహించలేరని ముక్తాయింపునిస్తున్నారు. దీంతో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యే వరకు అందరూ వేచి చూడాల్సిందే.
Also Read..శాసనసభ సభ్యత్వానికి ఈటల రాజీనామా.. లేఖ అందిన రెండు గంటల్లోనే స్పీకర్ ఆమోదముద్ర