Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో నాలుగైదు రోజుల నుంచి 50 మందికి పైగా మరణించారు. బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ తరుణంలో రాజధాని ఢిల్లీలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. వచ్చే నెల చివరి నాటికి ఢిల్లీలో 44 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. వీటిలో ఎనిమిదింటిని కేంద్రం ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ఢిల్లీ ప్రభుత్వమే తీసుకుందని తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్, ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత తీవ్రంగా వేధిస్తుందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతోపాటు.. వెంటనే ఉత్పత్తి ప్రారంభించే స్థితిలో ఉన్న మరో 21 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు.
గత వారం తీవ్రస్థాయికి చేరుకున్న ఆక్సిజన్ కొరత ప్రస్తుతం కాస్తంత సద్దుమణిగిందని, సకాలంలో పరిస్థితిని కొంత మేర చక్కదిద్దగలిగామని కేజ్రీవాల్ తెలిపారు. కొత్త రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. కాగా.. ప్రాణవాయువు రవాణా వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తొలి రైలు 70 టన్నుల ఆక్సిజన్‌తో మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ 70 టన్నులను ఏయే ఆస్పత్రులకు కేటాయించాలనే దానిపై ఢిల్లీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది.
కాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో చాలామంది రోగులు మరణిస్తున్నారు. నిన్న ఆక్సిజన్ కొరతతో పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా తదితర ప్రాంతాల్లో 12 మంది వరకు మరణించారు. దీంతోపాటు రెండు రోజుల క్రితం ఢిల్లీలో దాదాపు 50 మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు.
Also Read: