విహారయాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన నవ వధువు.. హోమ్‌స్టేలో రక్తపు మడుగులో మృతి

కొత్తగా పెళ్లయిన జంట.. అందంగా ముస్తాబై.. ఆనందంగా ముస్సోరికి చెక్కేసింది. ఓ హోటల్‌ రూమ్‌లో దిగి మాట ముచ్చట్లలో మునిగి.. మద్యం మత్తులో తేలిపోయింది. కట్ చేస్తే.. తెల్లారేసరికి నవ వధువు రక్తపు మడుగులో శవమై కనిపించింది. రూమ్‌లో ఉన్నది ఇద్దరే. భర్త తనకే పాపం తెలియదంటున్నాడు.. మరి ఆమె ఎలా చనిపోయింది? మత్తే ప్రాణం పోయేలా చేసిందా..? మూడో మనిషి ప్రమేయమేమైనా ఉందా?

విహారయాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన నవ వధువు.. హోమ్‌స్టేలో రక్తపు మడుగులో మృతి
P Radha Gayatri With Husband

Updated on: Jun 16, 2026 | 9:00 PM

రాధా గాయత్రి – శ్రీచరణ్ ఈ మధ్యే పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా విహార యాత్రకు బయలెళ్లారు.. అంతలోనే.. రాధా గాయత్రి రక్తపు మడుగులో శవమై కనిపించింది..
ఎవరైనా ఫాలో అయ్యారా..? ప్లాన్ ప్రకారమే కుట్ర పన్నారా..? విహార యాత్ర మాటున జరిగిన అసలు సీనేంటి?

వెకేషన్ కోసం జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేష్‌

రాధా గాయత్రి – శ్రీ చరణ్‌.. ఇద్దరి ప్రాపర్‌ ఏపీలోని విశాఖ. శ్రీ చరణ్‌ పుణేలోని ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుండగా.. రాధా గాయత్రి ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. వీళ్లిద్దరికి గతేడాది నవంబర్ 8న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. వెకేషన్ కోసం జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్లారు. మరుసటి రోజు రాత్రి ఆలస్యంగా ముస్సోరీలోని తిప్రీధర్ ఏరియాలోని కియానా హోమ్‌ స్టేకు చేరుకుని.. అందులోని బ్లిస్ అనే రూమ్‌లో చెక్ ఇన్ అయ్యారు. కట్ చేస్తే.. ఉదయం హోమ్‌ స్టేలో మహిళ డెడ్‌బాడీ పడి ఉందన్న సమాచారంతో 108తో సహా పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. అంబులెన్స్ ఫార్మసిస్టు ఆమెను పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు కన్‌ఫామ్ చేశాడు.

రక్తపు మడుగులో గాయత్రి

రూమ్‌లో భార్యభర్తలిద్దరూ మద్యం తాగారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించారు. ఉదయం లేచి చూసే సరికి గాయత్రి ఒంటిపై దుస్తులు లేకుండా.. రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు వివరించాడు శ్రీ చరణ్‌. భర్త స్టేట్‌మెంట్‌ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు.

అనుకోని ప్రమాదమా? కుట్ర కోణమా?

పెళ్లయి ఏడు నెలలైంది. అంతలోనే ఊహించని దారుణం. అతిగా మద్యం తాగిన కారణంగా ప్రమాదం జరిగిందా? లేదంటే కుట్ర కోణం ఉందా? విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు పోలీసులు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డెహ్రాడూన్‌లోని కోరనేషన్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా పోస్టుమార్టాన్ని ప్రత్యేక ప్యానల్‌తో నిర్వహించాలని.. ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలని పోలీసులు సూచించారు. విహార యాత్రకు వెళ్లిన నూతన వధువు.. అనుమానాస్పద స్థితిలో చనిపోవడం.. విశాఖలోని రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది.

Follow Us