Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై మరో కేసు నమోదు! ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2019లో దాఖలైన ఫిర్యాదు ప్రకారం, పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటుకు ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 18న చేపట్టనుంది.

ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్‌ను ఉల్లంఘించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరికొంతమందిపై ఢిల్లీ పోలీసులుఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో కంప్లైయన్స్ నివేదికను దాఖలు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసుపై ఏప్రిల్ 18న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై అధికారిక ఫిర్యాదు తర్వాత దర్యాప్తు ప్రారంభించినట్లు రాష్ట్ర పోలీసులు రౌస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ అంతటా పెద్ద హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మార్చి 11న ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసిజర్ సెక్షన్ 156(3) కింద దరఖాస్తును అనుమతించాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు అభిప్రాయపడింది.
దీని ప్రకారం, ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 కింద, కేసు వాస్తవాల నుండి జరిగినట్లు కనిపించే ఏదైనా ఇతర నేరం కింద వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత SHOను ఆదేశించినట్లు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు. 2019లో దాఖలైన ఫిర్యాదులో కేజ్రీవాల్, అప్పటి మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ (ఆప్ పార్టీ), ద్వారక A వార్డ్ మాజీ కౌన్సిలర్ నితికా శర్మలు ఆ ప్రాంతం అంతటా భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.