ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘనవిజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీతో బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టింది. 15 ఏళ్ల తర్వాత బీజేపీ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 130 స్థానాలను గెలుచుకుంది. 250 వార్డుల్లో సగం మార్కును ఆప్ పార్టీ అధిగమించింది. బీజేపీ 97 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 6 వార్డులకే పరిమితమైంది. ఇంకా కొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇంకా స్పష్టమైన మెజారిటీ తెలియాల్సి ఉంది.
దేశ రాజధానిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,349 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో మూడు పౌర సంస్థలు ఢిల్లీ కార్పొరేషన్ గా ఏకీకృతం అయిన తర్వాత ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
అయితే, MCDలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా అధికారం కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు నిరుత్సాహంలో నెలకొన్నారు. ఈ ఎన్నికల్లో మొత్త కేజ్రీవాల్ హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆప్ విజయం సాధించడంతో.. ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. విజయంతో ఢిల్లీ ఆప్ కార్యాలయం ముందు సంబరాలు మిన్నంటాయి. సీఎం కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం సిసోడియా , పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆప్‌కార్యాలయానికి చేరుకున్నారు.
2017లో 270 మునిసిపల్ వార్డులలో 181 మునిసిపల్ వార్డులను బిజెపి గెలుచుకుంది. అయితే అప్పుడు ఆప్ 48 మాత్రమే సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 30 స్థానాలతో మూడవ స్థానంలో నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..