Violating Covid Norms: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ఇంకా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంటే.. మరికొన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశాయి. దీంతో చాలామంది నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. కాగా.. దేశ రాజధానిలో కూడా కరోనా నిబంధనలు ఎత్తివేసినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను మాత్రం పాటించాలని ప్రభుత్వం ఆదేశించినా.. నిబంధనల ఊసే కనిపించడం లేదు. ఇక జనసంచారం ఉన్న ప్రాంతాల్లో అయితే.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కరోనా నిబంధనలు పాటించని మార్కెట్లపై కొరడా ఝుళిపించింది ఢిల్లీ ప్రభుత్వం.
కరోనా నిలయాలుగా మారుతున్న రెండు మార్కెట్లపై కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల జనపథ్ మార్కెట్‌పై నిషేధం విధించిన కేజ్రివాల్ ప్రభుత్వం.. తాజాగా సుల్తాన్‌పురి మార్కెట్‌పై ఆంక్షలు విధించింది. దీంతోపాటు సుల్తాన్‌పూర్ సబ్జీ మండీని మూసి వేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) అధికారులు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్‌లో భౌతిక దూరం పాటించనందున కూరగాయాల మార్కెట్‌ను ఈ నెల 16 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు కొవిడ్ ప్రొటోకాల్ పాటించని రాణీ బాగ్ బజార్, సదర్ బజార్, తదితర మార్కెట్లపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఢిల్లీలో కరోనా కేసుల కట్టడికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని.. ఈ తరుణంలో జనసంచారం ఎక్కువగా ఉండటంతో మరలా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని.. అందరూ కరోనా నిబంధనలను కఠినంగా పాటించాలని అధికారులు స్పష్టంచేశారు.
Also Read: