వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు.. సమాజంపై ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు..

|

Jan 19, 2022 | 9:32 PM

‘భర్త తన చట్టపరంగా జీవిత భాగస్వామి అయిన భార్యతో బలవంతంగా శారీరకంగా కలవడం అత్యాచారంగా పరిగణించబడదు.

వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు.. సమాజంపై ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు..
Follow us on

‘‘భర్త తన చట్టపరంగా జీవిత భాగస్వామి అయిన భార్యతో బలవంతంగా శారీరకంగా కలవడం అత్యాచారంగా పరిగణించబడదు. ఈ వ్యవహారంలో భర్త ఎంత మాత్రమూ దోషి కాదు. ఎందుకంటే వారు పరస్పర వివాహ సమ్మతి, ఒప్పందం ద్వారా భార్య తన సర్వస్వాన్ని భర్తకు అప్పగించినట్లైంది. దానిని ఉపసంహరించుకోలేరు.’’ అని 1736లో వైవాహిక అత్యాచారంపై ఆంగ్ల న్యాయ నిపుణుడు సర్ మాథ్యూహేల్ అన్నారు. దురదృష్టావశాత్తు హేల్ అభిప్రాయం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో శాసన, న్యాయపరమైన గుర్తింపును పొందింది. అత్యాచార చట్టాలు, భార్యభర్తల మధ్య ఇష్టం లేని శారీరక కలయికను రేప్ పరిధి నుంచి దూరం చేసింది.

ఒక పురుషుడు, స్త్రీ వివాహం చేసుకున్న తరువాత శారీరక కలయికకు సంబంధించి భార్య సమ్మతి అవసరం లేదన్నట్లుగా భావిస్తూ వస్తోంది సమాజం. వివాహం పౌర ఒప్పందంగా పరిగణించబడుతూ.. లైంగిక కార్యకలాపాలకు సమ్మతి ఈ వివాహం అనే భావన సమాజంలో ఏర్పడింది. అంతేకాదు.. వివాహం తరువాత స్త్రీ, పురుషుల ఆస్తి హక్కు, సెక్స్ అనేది పురుషుల హక్కు అనే భావన సైతం నాటి నుంచి నేటి వరకూ ఉంది.

పురుషులు తమ భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడనప్పటికీ, వివాహం లైసెన్స్ ఇస్తుందని ఒక భావన జనాల్లో వేళ్లూనుకుపోయింది. భార్యాభర్తలు కాని ఒక స్త్రీపై పురుషుడు బలత్కారానికి పాల్పడితే అత్యాచారంగా పరిగణిస్తారు. స్త్రీ, పురుషుల మధ్య సమ్మతి లేని సెక్స్‌ని కూడా అత్యాచారంగా పేర్కొంటారు. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే భావన ఉంది.

అయితే, కాలం గడుస్తున్నా కొద్ది సమాజంలో, ప్రజల ఆలోచనల్లో వేగంగా మార్పు చోటు చేసుకుంది. అనేక దేశాల్లో నేడు వివాహం తరువాత బలవంతపు శృంగారం నేరంగా పరిగణిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఇష్టం లేని శారీరక కలయికను రేప్‌గా పరిగణించాలనే గొంతులు ఎక్కువ అవుతున్నాయి. మహిళలు తమ భర్తలతో అవాంఛిత సెక్స్‌ను లైంగిక హింసగా భావిస్తున్నారు.

అయితే, వైవాహిక అత్యాచారం అనేది ప్రాధాన్యత కలిగిన అంశం అయినప్పటికీ.. మహిళలపై ఈ రకమైన హింస పట్ల సామాజిక వేత్తలు, న్యాయ వ్యవస్థ, సమాజం నుంచి ఎక్కువగా ప్రాధాన్యత లభించడం లేదు. అయితే, వీటన్నింటిని ఇప్పుడు సవాల్ చేస్తోంది మహిళా లోకం.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటీషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. విచారణ చేపట్టింది. అత్యాచార చట్టంలో మహిళలు అనుభవించే లైంగిక వేధింపుల వాస్తవాలను ప్రతిబింబించాలని, వైవాహిక అత్యాచారానికి మినహాయింపును తొలగించాలని పిటిషనర్లు కోరుతున్నారు.

‘‘వైవాహిక అత్యాచారం హింసకు సంబంధించినది. స్త్రీకి ఇష్టం లేకుండా బలవంతం చేయడం నేరమే అవుతుంది. అలాగే వైవాహిక అత్యాచారం అనేది ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కు, లైంగిక నిర్ణయాలు తీసుకునే గోప్యత హక్కును కూడా ఉల్లంఘిస్తుంది.’’ అని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

వివాహం కాని పురుషుడు, స్త్రీ మధ్య ఇష్టంలేని సెక్స్ జరిగితే అది అత్యాచారంగా పరిగణించబడుతుందని, వివాహం తరువాత ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే సరైన చర్యగా పేర్కొనడం అసమాన చర్యగా పేర్కొన్నారు. చట్టంలోని ఈ అసమానతను కూడా సవరించాలని న్యాయస్థానాన్ని పిటిషనర్లు కోరారు. వివాహ బంధంలో బలవంతపు లైంగిక సంపర్కాన్ని అత్యాచారంగా వర్గీకరించడంలో సమస్య ఏంటని సందేహం వ్యక్తం చేశారు పిటిషనర్లు.

అయితే, ఈ సమస్య పైకి కనిపించినంత సున్నితమైన, సులభమైనది కాదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తు్నారు. శతాబ్దాలుగా వివాహ బంధంతో స్త్రీ, పురుషుడు ఒక్కటై తమ జీవితాంతం కలిసి జీవించడమే కాకుండా లైంగిక అవసరాలనూ తీర్చుకుంటూ వస్తున్నారు. ఇలాంటి బంధాన్ని బలత్కారం పేరుతో బలవంతంగా శృంగారం చేశారని భర్తను శిక్షించాలనే భావన సరికాదని అని అభిప్రాయపడుతున్నారు. పిటిషనర్లు పేర్కొన్నట్లుగా అదే జరిగితే వివాహ వ్యవస్థ భీటలువారే ప్రమాదం ఉంది. సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనిని సమగ్ర దృక్పథంలో చూడాల్సి ఉందని చెబుతున్నారు. స్త్రీల పట్ల జరుగుతున్న అమానుషాలను పరిగణలోకి తీసుకుంటూనే.. వైవాహిక అత్యాచారం అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే.. ఈ సమస్య ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వ వైఖరి లింగ సమానత్వం ఆలోచనను ప్రతిబింబించడమే కాకుండా వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని, వాస్తవాలు, అవాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి కేంద్రం ఇలా ముందడుగు వేస్తుందో, ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

Also read:

Chips Packet: చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఎందుకు నింపుతారో మీకు తెలుసా? అసలు ఏ గ్యాస్ నింపుతారో తెలుసా?..

Budget2022: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి ఉపయోగించే పదాలకు అర్ధాలు తెలుసా?

Raisins with Milk: ఈ పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా.. రోజూ ఇలాగే తాగుతారు..!(వీడియో)