పాక్‌ గగనతలంలోకి దూసుకెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానం.. అర్ధరాత్రి హైడ్రామా.. అసలేం జరిగిందంటే?

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సోమవారం రాత్రి (జూన్ 22, 2026) ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుండి అమృత్‌సర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-479) సాంకేతిక లోపం కారణంగా దారి తప్పింది. నిషేధిత పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో జరిగిన ఈ ఘటన రక్షణ వర్గాలను సైతం అప్రమత్తం చేసింది.

పాక్‌ గగనతలంలోకి దూసుకెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానం.. అర్ధరాత్రి హైడ్రామా.. అసలేం జరిగిందంటే?
Air India Flight

Updated on: Jun 24, 2026 | 9:36 PM

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సోమవారం రాత్రి (జూన్ 22, 2026) ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుండి అమృత్‌సర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-479) సాంకేతిక లోపం కారణంగా దారి తప్పింది. నిషేధిత పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో జరిగిన ఈ ఘటన రక్షణ వర్గాలను సైతం అప్రమత్తం చేసింది.

పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో, భారతీయ విమానాలపై పాకిస్తాన్ గగనతల నిషేధం విధించింది. జూన్ 16న జారీ చేసిన కొత్త నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) ప్రకారం ఈ నిషేధం జూలై 24 వరకు అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం రాత్రి 9:18 గంటలకు ఢిల్లీలో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం తన రూట్ తప్పి పాకిస్తాన్‌లోని లాహోర్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్‌లోకి దూసుకెళ్లింది. సరిహద్దు దాటి దాదాపు ఒకటిన్నర మైలు లోపలికి ప్రవేశించిన వెంటనే.. పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుండి పైలట్‌కు తీవ్ర హెచ్చరికలు అందాయి. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని యూ-టర్న్ తిప్పి, సురక్షితంగా భారత గగనతలంలోకి తీసుకువచ్చారు.

అమృత్‌సర్‌లో ల్యాండింగ్ నిరాకరణ.. గాల్లో చక్కర్లు!

భారత సరిహద్దుల్లోకి వచ్చినప్పటికీ ప్రయాణికుల కష్టాలు తీరలేదు. రాత్రి 10:30 గంటలకు అమృత్‌సర్‌లో దిగాల్సిన ఈ విమానానికి, అక్కడ అప్పటికే ట్రాఫిక్ పెరిగిపోవడంతో రన్‌వే లభ్యత లేకపోయింది. దీంతో విమానం అమృత్‌సర్ గగనతలంలోనే చాలా సేపు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరికి కంట్రోల్ రూమ్ ఆదేశాల మేరకు విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించగా, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది.

అర్ధరాత్రి సేఫ్ ల్యాండింగ్!

ఢిల్లీలో దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన తర్వాత, క్లియరెన్స్ రావడంతో విమానం మళ్లీ అమృత్‌సర్‌కు బయలుదేరింది. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున 2:20 గంటల ప్రాంతంలో విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ హైడ్రామా కారణంగా ప్రయాణికులు సుమారు నాలుగు గంటల పాటు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రన్‌వే ట్రాఫిక్ వల్ల విమానాలు గాల్లో వేచి ఉండటం సాధారణమే అయినప్పటికీ, ఈ ఘటనలో సాంకేతిక లోపమే అసలు కారణమని అధికారులు భావిస్తున్నారు. విమాన నావిగేషన్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయిందనే కోణంలో ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us