
దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి తీవ్రమవుతోంది. హస్తినని దుమ్ము, ధూళి కమ్మేశాయి. ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-AQI 298గా నమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే రాజస్థాన్ మీదుగా ఆవరించిన ఇసుక తుపాను ప్రభావంతోనే ఢిల్లీలో దుమ్ము, దూళి రేగుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం కళ్ల మంటలు, శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు.
రాజస్థాన్, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో ఢిల్లీని దుమ్ము, ధూళి కమ్మేసిందని చెప్తున్నారు అధికారులు. అటు సెంట్రల్ ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో దుమ్ము ప్రభావం ఎక్కువగానే ఉంది. ఉదయం ఆరు గంటల నుంచే దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో భారీ వర్షం కురిసింది.
ఇవాళ కూడా ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దుమ్ము, ధూళి ప్రభావంతో ఢిల్లీలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలోను ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా దుమ్ము, దూళితో కూడిన గాలులు, వానలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వానలు.. పిడుగులు పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. ప్రజలు వీలైనంతమేరకు ఇంటి లోపలే ఉండాలని హెల్త్ అడ్వైజరీ జారీ అయ్యింది. అనవసరంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులకు గురికావొద్దంటూ సూచనలు చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..