
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధ వీరుడి కుమార్తె, 23 ఏళ్ల రియా కుమారి థాపా తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆమె గది తలుపు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. మధ్యాహ్న భోజనానికి పిలవడానికి వెళ్లిన తల్లి పలుమార్లు తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపును బలవంతంగా తెరిచారు. లోపల రియా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో “ఐ లవ్ యూ.. అమ్మా, నాన్నా. ఇందులో ఎవరి తప్పూ లేదు” అని ఆమె రాసినట్లు సమాచారం. అలాగే తన మరణానికి ఎవరినీ బాధ్యులను చేయవద్దని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ తెలిపిన వివరాల ప్రకారం.. రియా రాత్రిపూట చదువుకునే అలవాటు ఉండటంతో సాధారణంగా ఆలస్యంగా నిద్రలేచేదని చెప్పారు. చదువులో ఆశించిన విజయాన్ని సాధించలేకపోవడం వల్ల కలిగిన నిరాశే ఈమె ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
రియా థాపా 12వ తరగతిలో 97 శాతం మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET-UG పరీక్షలో తొలి ప్రయత్నంలో అర్హత సాధించలేకపోయిన ఆమె, జూన్ 21న జరగనున్న రీ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. పరీక్ష కోసం తమ కూతురు ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతుందని భావిస్తున్న తల్లిదండ్రులకు చివరికి కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి