ఫెంగల్ తుపాను గడియగడియకు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారం సాయంత్రానికి 5.30కు తుపానుగా బలపడింది. దీని ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పలు జిల్లాలు నీటమయం అయ్యాయి. ఈ క్రమంలో భారీ వర్షాల కారణంగా మైలాడుతురై జిల్లా తరంగంబాడి సమీపంలో బుధవారం ఉదయం 150 ఏళ్ల నాటి బంగ్లా ఒక్కసారిగా కుప్పకూలింది. ఇల్లు కూలిపోతున్న షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
మైలాడుతురై జిల్లా తరంగంబాడి తాలూకా సెంబనార్కోవిల్ యూనియన్ పరిసర ప్రాంతాల్లో గత 3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. చాలా చోట్ల నివాసాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో తిరుక్కలచేరి పంచాయతీలోని బాలూర్ గ్రామంలో 150 సంవత్సరాలకు పైగా పురాతనమైన పెద్ద బంగ్లా ఒకటి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంటి ముందు భాగం మొత్తం కూలిపోవడంతో ఇంటి సమీపంలోని విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ పురాతన ఇంటి వెనుక భాగంలో మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాలతో బయటపడ్డాయి.
VIDEO | An old house collapsed in Tamil Nadu’s Mayiladuthurai due to heavy rains earlier today.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W
— Press Trust of India (@PTI_News) November 27, 2024
ఈ ఇల్లు కూలిన దృశ్యాన్ని సమీపంలోని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ ఇంట్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా గడచిన 24 గంటల్లో మైలాడుతురై జిల్లాలో గరిష్టంగా 13 సెంటీమీటర్లు, కనిష్టంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.