Tamilnadu Politics: ఆసక్తికరంగా తమిళ రాజకీయాలు.. చిన్నమ్మ రాకతో మారిపోనున్న సీన్.. ఎత్తుకు పైఎత్తు

| Edited By: Team Veegam

Mar 04, 2021 | 2:19 PM

తమిళ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తీసుకుంటున్నాయి. జయలలిత మరణం, ఆ తర్వాత శశికళ జైలు పాలవడంతో బీజేపీ పంచన చేరిన ఏఐఏడీఎంకే తాజాగా...

Tamilnadu Politics: ఆసక్తికరంగా తమిళ రాజకీయాలు.. చిన్నమ్మ రాకతో మారిపోనున్న సీన్.. ఎత్తుకు పైఎత్తు
Follow us on

Crucial turn in Tamilanadu politics: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తమిళ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తీసుకుంటున్నాయి. జయలలిత మరణం, ఆ తర్వాత శశికళ జైలు పాలవడంతో బీజేపీ పంచన చేరిన ఏఐఏడీఎంకే తాజాగా శశికళ జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలవడం.. కొన్ని రోజులు బెంగళూరులో వుండి.. అట్టహాసంగా చెన్నైకి చేరుకోవడంతో ఇరకాటంలో పడినట్లు కనిపిస్తోంది. శశికళను గతంలోనే అన్నా డిఎంకే నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమెను పార్టీ దరిదాపుల్లోకి రానీయకుండా ప్రస్తుతం అన్నా డిఎంకేకు సారథ్యం వహిస్తున్న ఫళని, పన్నీరు వర్గం భావిస్తుండగా.. శశికళ వర్గం మాత్రం ఆమె పార్టీలో అంతర్భాగమే అని చాటేందుకు యత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు నుంచి చెన్నై రహదారిలో 16 చోట్ల శశికళకు ఘన స్వాగతం పలికేందుకు ఆమె అనుకూలం వర్గం ఏర్పాట్లు చేసింది. శశికళ ఉపయోగించే కారుకు అన్నా డిఎంకే పార్టీ జెండాను పెడితే పోలీసులు తీసి పారేశారు. అయితేనేం ఆమె వర్గం అదే పనిగా చిన్నమ్మ కారుకు పార్టీ జెండాను తగిలించారు.

అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఫిబ్రవరి 8వ తేదీన తమిళనాట అడుగుపెట్టడంతో రాష్ట్ర రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాలక ఏఐఏడీఎంకే అధినాయకత్వం హెచ్చరికలను ఖాతరు చేయకుండా.. తాను ప్రయాణిస్తున్న కారుపై ఆ పార్టీ జెండాను ఉపయోగించి తన వైఖరేంటో రాజకీయ వర్గాలకు పరోక్షంగా వెల్లడించారు చిన్నమ్మ. పార్టీలో తన విధేయులను సమీకరించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి తన బలం చాటుకునే యత్నాలను ఆమె ఇదివరకే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో 4 ఏళ్ళ శిక్షను అనుభవించిన శశికళ.. తమిళనాడులో అడుగుపెట్టే సమయంలోనే తన దూకుడేంటో చాటిచెప్పారు. ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగింపునకు గురైనప్పటికీ.. ఆమె మాత్రం పార్టీ జెండాను ప్రదర్శించడంతోపాటు.. పార్టీలో తన వర్గానిదే పైచేయి అని చెప్పేందుకు యత్నించారు. అలాగే ఆకుపచ్చని (గ్రీన్ కలర్) చీరలో దర్శనమిచ్చిన శశికళ, తన మద్దతుదారులను ఉత్సాహపరిచే విధంగా హావభావాలను ప్రదర్శించారు. అయితే అన్నా డిఎంకే జెండాను చిన్నమ్మ వర్గం ఉపయోగించడంపై అధికార పార్టీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ‘‘మేం ఎవరికి భయపడం. పార్టీ కార్యకర్తలు మాతోనే ఉన్నారు. ఏఐఏడీఎంకే పార్టీ జెండా మాకు చెందినది’’ అని రాష్ట్ర మంత్రి సీవీ షణ్ముగమ్ అన్నారు. ఇప్పటికే తాము శశికళపై ఫిర్యాదు చేశామని ఆయన మీడియాకు వెల్లడించారు.

జయలలిత బతికున్నప్పట్నించి శశికళకు పార్టీపై పట్టుంది. తనకంటూ ఓ వర్గాన్ని ఆమె మెయింటేన్ చేస్తూ వచ్చారు. జయలలిత ఆగ్రహానికి గురైన సమయంలోను శశికళ తన వర్గాన్ని తన కనుసన్నల్లో వుంచుకున్నారు. జయలలిత ప్రాపకం కోసం ఓ వైపు ప్రయత్నిస్తూనే.. మరోవైపు తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. జయలలిత మరణం తర్వాత కూడా తన వర్గాన్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో చిన్నమ్మకు జైలు శిక్ష ఖరారైన సందర్భంలో ఆమె వర్గంలో చాలా మంది తప్పనిసరైన పరిస్థితిలో పార్టీకి విధేయత ప్రకటించినా.. వారంతా శశికళ విడుదల సమయం కోసం వేచి వున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

శశికళ తమిళనాడులో ముఖ్యమైన తేవార్ వర్గానికి చెందినవారు. ఏఐఏడీఎంకేకు తేవార్లు కీలక ఓటు బ్యాంకుగా వున్నారు. వచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో శశికళ తిరిగి రాక ప్రత్యేకతను సంతరించుకుంది. శశికళ ఎత్తుగడలు, వ్యూహాలు తెలిసిన వారంతా వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రభావం తప్పకుండా వుంటుందని అంఛనా వేస్తున్నారు. అయితే చిన్నమ్మ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆరు సంవత్సరాల నిషేధం ఉన్న కారణంగా.. ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. అయితే, పార్టీపై పట్టు సాధించడం ద్వారా తన సత్తా చాటాలని, తన అడుగులకు మడుగులొత్తే వారిని సీఎం చేయడం ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని శశికళ వ్యూహ రచన చేస్తున్నారు. ఏఐఏడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళేనంటూ తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. కోవిడ్ నిబంధనల కారణంగా భారీగా జనాలు గుమిగూడే సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు చిన్నమ్మ వర్గాన్ని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు ఆచరణలో అమలవడం సందేహమే.

శశికళ చెన్నై చేరిన తర్వాత తమిళనాట రాజకీయాలు శరవేగంగా మార్పులకు గురవుతాయని రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. రాజకీయ దిగ్గజాలను కోల్పోయిన తమిళ రాజకీయాల్లో శశికళ డామినేషన్ ఏ మేరకు వుంటుంది? ఆమెను నిలువరించడంలో ఏఐఏడిఎంకే అధినాయకత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటుంది? ఈ రాజకీయ పరిణామాలను గమనిస్తున్న అన్నా డిఎంకే మిత్ర పక్షం బీజేపీ ఎలా స్పందిస్తుంది? మరోవైపు సీఎం కావాలని ఉవ్విళ్ళూరుతున్న డిఎంకే అధినేత స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలాంటి వ్యూహాలను అమలుపరుస్తారు? ఇలాంటి ప్రశ్నలిపుడు తమిళ రాజకీయాలను పరిశీలిస్తున్న వారిలో కలుగుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల పాటు తమిళనాడు రాజకీయం మరింత రంజుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also read: కరోనా వైరస్ రూపాంతరం..! వ్యాక్సిన్‌ల మార్పు అనివార్యమా? సైంటిస్టుల తాజా పరిశోధన తేలింది ఇదే!

Also read: ‘ఆ’ దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీరు ఇబ్బందుల్లో పడడం ఖాయం