కరోనా వైరస్ దేశంలో అలజడి రేపుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్న సోయి జనాల్లో లోపిస్తోంది. తెలిసీ చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇంటిపట్టునే ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో మందులు తీసుకోవాలని ప్రభుత్వాలు, వైద్యాధికారులు ఎంతగా చెబుతున్నా చెవికి ఎక్కించుకోవడం లేదు కొందరు. క్వారంటైన్ నియమాలు పాటించకుండా గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఓ మూర్ఖపు శిఖామని చేసిన తెలివితక్కువ పని కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి.. అరుణ్ మిశ్రా అనే అతడు ఏం చేశాడంటే పాజిటివ్ ఉన్నా ఓ పెళ్లికి హాజరయ్యాడు. హాజరైతే అయ్యాడు ఓ మూలకు కూర్చుని పెళ్లి తతంగమంతా చూసి వచ్చేస్తే కొంతలో కొంత బాగుండేది. కానీ అతడు పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు వడ్డించాడు. అలా విందు భోజనంతో పాటు కరోనాను కూడా ఆహుతులకు వడ్డించాడు. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు పెట్టారు. ఏప్రిల్ 27న అతడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు చెప్పి మందులిచ్చారు.
డాక్టర్లు చెప్పింది వినకుండా బంధువుల పెళ్లికి వెళ్లాడు. తనకు కోవిడ్ ఉందన్న విషయాన్ని అక్కడెవరికీ చెప్పలేదు. ఒక్కడే వెళ్లకుండా తనతో రంజన్ నాయక్, స్వరూప్‌సింగ్ అనే ఫ్రెండ్స్‌ను కూడా పెళ్లికి పట్టుకెళ్లాడు. పనులన్నీ తనే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ వడ్డన కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు. ఇందుకోసమే కాచుక్కూర్చున్న కరోనా అందరినీ అంటుకుంది. ఇలా కేసులు ఎందుకు పెరిగాయా అని అధికారులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. కరోనా సోకిందని తెలిసి కూడా క్వారంటైన్ ఉండకుండా పెళ్లికి అటెండవ్వడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అరుణ్ మిశ్రాతో పాటు ఇద్దరి స్నేహితులపై కూడా కేసులు పెట్టారు. ప్రస్తుతం అరుణ్ మిశ్రా, అతడి స్నేహితుడు స్వరూప్‌సింగ్ పృథ్వీపూర్‌లోని కోవడ్ సెంటర్‌లో ఉన్నారు. రంజన్ నాయక్ మాత్రం పరారీలో ఉన్నారు. అతడి కోసం వెతుకుతున్నామని జెరాన్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రసింగ్ చెప్పారు..
మరిన్ని చదవండి ఇక్కడ :
ఊరు ఊరంతా ఐసోలేషన్!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.