Coronavirus Vaccine Registration: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ.. మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం రెండు రోజుల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులను నియంత్రించాలంటే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. 18ఏళ్లు పైబడిన వారందరికీ.. ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్లడించారు. ఈ మేరకు అందరూ కూడా కోవిన్ యాప్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ కూడా కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని శర్మ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు గతంలో మాదిరిగానే ఉంటాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరిన్ని ప్రభుత్వ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచినట్లు పేర్కొన్నారు.
కాగా దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలసిందే. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించారు. అనంతరం మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ.. వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా.. 13,23,30,644 డోసులను లబ్ధిదారులకు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: