Covid-19 Vaccination: వ్యాక్సిన్ ధరలపై న్యాయవ్యవస్థ జోక్యం అనవసరం.. నిపుణులను సంప్రదించాకే నిర్ణయించామన్న కేంద్రం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటుంది. వ్యాక్సిన్ల ధరలు, కొరత, నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియపై సుప్రీంకోర్టు సైతం చివాట్లు పెట్టింది. దీంతో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
Centre tells Supreme Court on Vaccination: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటుంది. వ్యాక్సిన్ల ధరలు, కొరత, నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియపై సుప్రీంకోర్టు సైతం చివాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. తమ వ్యాక్సినేషన్ విధానాన్ని సమర్థించుకుంది ప్రభుత్వం.. ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదని ఆఫిడవిట్‌లో పేర్కొంది. వ్యాక్సిన్లపై నిర్ణయాలను మాకు వదిలేయండి. ఈ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనార్థం తీసుకున్నామని కేంద్రం తెలిపంది. మెడికల్, సైంటిఫిక్ ఎక్స్‌పర్ట్స్ సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ల ధరలను మరోసారి పరిశీలించాలని గతవారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో మాత్రం కోర్టు జోక్యం వద్దని కేంద్రం వాదిస్తోంది. అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెబుతోంది. ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం అనవసరం అంటోంది. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పాలకులకే ఈ నిర్ణయాన్ని వదిలేయండి అని తన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరం, భారత్ బయోటెక్‌లు కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు మరో ధర నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. కేంద్రానికి ఈ రెండు వ్యాక్సిన్లను రూ.150కే అమ్ముతున్న సంస్థలు రాష్ట్రాల విషయానికి వస్తే సీరం రూ.300, భారత్ బయోటెక్ రూ.400 వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాగా, మరోవైపు, రాష్ట్రాలే నేరుగా డ్రగ్స్ కంపెనీల ద్వారా వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇందే క్రమంలో 14 రాష్ట్రాలు అయా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.