Career Options After 10th 2026: కెరీర్‌లో త్వరగా సెటిల్ అవ్వాలంటే.. తిరుగులేని రామబాణం ఐటీఐ ట్రేడ్స్! ప్రవేశాలు ఎలా పొందాలంటే..
నేటి పోటీ ప్రపంచంలో ఒకటికి రెండు, మూడు డిగ్రీలు ఉన్నా ఉపాధికి గ్యారెంటీ దొరకడం లేదు. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు, చేతిలో నైపుణ్యాలు కూడా ఉంటేనే ఉపాధి లభిస్తుంది. దీంతో యువత తమ కెరీర్ ఎంపికల్లో వినూత్న ధోరణి అవలంభిస్తున్నారు. తక్కువ వ్యవధిలో చదివి.. త్వరగా స్థిరపడేందుకు ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్)కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్ధులు ఐటీఐలలో చేరేందుకు అధిక ఆసక్తి చూపుతున్నారు..

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాస్తే చాలు.. నచ్చిన ఐటీఐ కోర్సుల్లో చేరొచ్చు. కొన్ని ప్రత్యేక ట్రేడులకు 8వ తరగతి చదివినవారు కూడా అర్హులే. ఐటీఐలో చేరేందుకు సాధారణంగా ఆగస్ట్ 1, 2026 నాటికి కనీసం 14 ఏళ్లు నిండి ఉండాలి. డ్రోన్ టెక్నాలజీకి 16 ఏళ్లు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. పాలీసెట్ ర్యాంకుతోపాటు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. సుమారు యాభై రకాల స్పెషలైజేషన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల కోర్సులు.. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్ /మెకానికల్), మెకానిక్ మోటార్ వెహికల్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మొదలైనవి.
ఏడాది కోర్సులు.. కంప్యూటర్ ఆపరేటర్, వెల్డర్, ప్లంబర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్ తదితరాలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా డ్రోన్ టెక్నీషియన్, ఈవీ, రోబోటిక్స్ మొదలైన అత్యాధునిక ట్రేడుల్లోనూ శిక్షణ అందిస్తున్నారు. ఐటీఐ పూర్తి చేసినవారికి రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులు, విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్‌మెన్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్ తదితర రక్షణ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే స్టీల్ ప్లాంట్, ఓఎన్‌జీసీ లాంటి వాటిలోనూ కొలువులు సాధించుకోవచ్చు. టామ్‌కామ్ (TOMCOM), ఓమ్‌క్యాప్ (OMCAP) లాంటి సంస్థల ద్వారా సింగపూర్, గల్ఫ్, మలేసియా వంటి విదేశాల్లో ఉపాధి పొందొచ్చు. ఉన్నత చదువు కొనసాగించాలనుకునే వారు ఐటీఐ తర్వాత నేరుగా డిప్లొమా (పాలిటెక్నిక్) రెండో ఏడాదిలోకి లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌లో ప్రవేశాలు పొందొచ్చు.
ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాలీసెట్ 2026కు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పాలీసెట్‌కు ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏపీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అటు తెలంగాణ పాలీసెట్ 2026కు ఏప్రిల్ 20, 2026వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. పాలీసెట్ రాత పరీక్ష మే 13, 2026వ తేదీన నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
