Nataraja Swamy Temple : మహా శివుడు కొలువైన అద్భుతమైన ఆలయం అది! పరమేశ్వరుడి అయిదు పవిత్రమైన ఆలయాలలో అదొకటి! పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్త్వానికి నిదర్శనం ఆ ఆలయం! నటరాజ రూపంలో శివుడు దర్శనమిచ్చే ఏకైక ఆలయం కూడా ఇదే! అదే చిదంబర ఆలయం! ఆ ఆలయ రహస్యం శాశ్వతంగా రహస్యంగానే ఉండిపోవచ్చు. కానీ ఆలయ సంపద రహస్యం మాత్రం ఎప్పుడో ఒకప్పుడు వీడిపోవలసిందే! పరమశివుడు నిరాకర స్వరూపుడుగా కొలువున్న ఈ ఆలయం సంపద ఎంత అన్నది కొన్ని రోజుల్లో తేలిపోనుంది. రెండు నెలలుగా ఆలయ దీక్షితులు, దేవాదాయ శాఖ అధికారుల మధ్య కొనసాగుతూ వచ్చిన మాటల యుద్ధానికి పుల్‌స్టాప్ పడింది. ఆలయ సంపద లెక్కింపునకు దీక్షితుల వర్గం అంగీకరించడంతో ప్రక్రియ మొదలయ్యింది. రెండు రోజుల పాటు ఈ లెక్కింపు కొనసాగుతుంది.
గత కొంతకాలంగా నటరాజస్వామి ఆలయ ధనాగారంలో సంపదను లెక్కించేందుకు దీక్షితుల వర్గం అడ్డుచెబుతూ వచ్చింది. ధనాగారానికి 20 తాళాలతో భద్రపరిచ్చారు. ఈ తాళాలు దీక్షితుల అధీనంలో ఉండడంతో తమిళనాడు దేవాదాయ శాఖ వారిని ఒప్పించింది. దీక్షితుల వర్గం సమక్షంలో లెక్కింపు జరిపేందుకు అంగీకరించారు. దీంతో రెండు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కడలూరు, తిరువణ్ణామలై, జిల్లా దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ లెక్కింపు జరుగుతోంది.
ఎట్టకేలకు అంగీకరించడంతో..
చిదంబరం ఆలయ సంపద వివరాలు తెలపాల్సిందిగా దీక్షితులు వర్గానికి తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ నోటీసులు పంపడంతో వివాదం మొదలయ్యింది. నటరాజ స్వామి ఆలయ సంపదపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదంటూ నిన్నటి వరకు దీక్షితులు వర్గం వాదిస్తూ వచ్చింది. 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆలయానికి సంబంధించిన పూర్తి హక్కులు దీక్షితులవేనని చెబుతూ వచ్చింది. దేవాదాయ శాఖ ఉత్తర్వులను ఖండిస్తూ అటు రాష్ట్రపతికి, ఇటు ప్రధానికి లేఖలు కూడా రాసింది దీక్షితులు వర్గం. పనిలో పనిగా గవర్నర్‌కు కూడా ఓ మాట చెప్పింది. ఆలయ సంపద విషయంలో ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమేనని హెచ్చరించింది! అప్పట్నుంచి సంపదను లెక్కించేందుకు దీక్షితులు వర్గం అడ్డు చెబుతూ వచ్చింది.
తమిళనాడు దేవాదాయ శాఖ మాత్రం దీక్షితులు వర్గానికి నచ్చ చెబుతూ వచ్చింది. మొత్తం మీద వారిని ఒప్పించగలిగింది. దీంతో వివాదం సద్దుమణిగింది. లెక్కింపు మొదలయ్యింది. రెండు మూడు రోజుల్లో సంపద ఎంత అన్నదానిపై ఓ క్లారిటీ రానుంది. నటరాజస్వామి ఆలయ ఆస్తుల వివరాలు, ఆదాయం, ఖర్చుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని నోటీసులను పంపించడంపై దీక్షితుల వర్గం గతంలో తప్పు పట్టింది. నటరాజస్వామి ఆలయ సంపదఫై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదంటూ తేల్చి చెప్పారు.
స్టాలిన్ సర్కార్‌కు వార్నింగ్..
గతంలో తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం మీద హిందూ పీఠాధిపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సంపదను డీఎంకే సర్కారు దోచుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వాల అధీనంలో ఉన్న ఆలయాలలో హుండీలలో ఇకపై ఎవరు కానుకలు వేయరాదని భక్తులకు పిలపునిచ్చారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖను రద్దు చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. ఆలయాల సంపద, ఆదాయంపై ప్రభుత్వ పెత్తనాన్ని ప్రశ్నించారు. శైవ క్షేత్ర ఆలయాల సంపదఫై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము రాజకీయాలు చేస్తే పరిస్థితి మారిపోతుందని స్వామీజీలు స్టాలిన్ ప్రభుత్వానని హెచ్చరించారు.
చివరిసారిగా 2005లోనే..
చిదంబరం నటరాజ ఆలయంలో స్వామివారికి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాలన్నీ మొదట 1956 లో లెక్కించి వాటి వివరాలను పొందుపరిచారు. అప్పటి నుండి, ఆభరణాలు వివిధ దశలలో ఆడిట్ చేసినప్పటికీ చివరిగా ఆలయ సంపద కి సంబంధించిన వివరాలను 2005 లో సేకరించినట్టుగా దీక్షితుల వర్గం చెబుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆలయ సంపదకు సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. దీక్షితుల అధీనంలో ఆలయం ఉండడం, సుప్రీం కోర్ట్ దీక్షితుల కి మద్దతుగా ఆలయ సంపద, ఖర్చు కి సంబంధించిన బాధ్యత ఇవ్వడంతో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఆలయం విషయంలో జోక్యం చేసుకోలేదు. కానీ డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆలయంలో అవకతవకలు, సంపద విషయంలో వేల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో స్టాలిన్ సర్కార్ ఆలయ సంపద లెక్కింపుని సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేక అధికారుల సమక్షంలో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సోమవారం సంపద లెక్కింపుని ప్రారంభించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..