ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ వైఖరిని నిరసిస్తూ రాజ్యసభలో అస్సాంకు చెందిన కాంగ్రెస్ పార్టీ విప్ భువనేశ్వర్ కలిటా రాజీనామా చేశారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా తమ పార్టీ ఆత్మహత్యకు పాల్పడినట్టే అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇవాళ విప్ జారీ చేయాలని పార్టీ నాయకత్వం తనను కోరిందని, అయితే ఇది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని తాను భావించానని ఆయన అన్నారు. అందువల్లే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు భువనేశ్వర్ కలిటా వివరించారు. కేంద్ర ఉత్తర్వులపై రాజ్యసభలో కాంగ్రెస్ సహా కొన్ని విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా… సభలో సాక్షాత్తూ కాంగ్రెస్ విప్ ఒకరు రాజీనామా చేయడం సంచలనమైంది.