Bharat Jodo Yatra: ఎర్రకోట వేదికగా రాహుల్ స్పీచ్.. మోదీ సర్కార్‌కి స్ట్రాంగ్ మెసేజే అయ్యిందా?
మంత్రదండం ప్రయోగించడం మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్‌గాంధీ. ఇన్ని రోజుల పాదయాత్రలో ఏమేం నేర్చుకున్నావ్ అని అడక్కముందే... అన్నీ చెప్పేస్తున్నారు.
మంత్రదండం ప్రయోగించడం మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్‌గాంధీ. ఇన్ని రోజుల పాదయాత్రలో ఏమేం నేర్చుకున్నావ్ అని అడక్కముందే… అన్నీ చెప్పేస్తున్నారు. మోదీ సర్కార్‌ని నిలదియ్యడమొక్కటే కాదు.. తన పార్టీని బలిష్టం చెయ్యడానిక్కూడా పాదయాత్రను వాడేసుకుంటున్నారు. లేటెస్ట్‌గా లోకనాయకుడితో రాహుల్ నడక.. కొత్తకొత్త అంచనాల్ని పుట్టిస్తోంది.
కొంచెం నీరు.. కొంచెం నిప్పు.. రాహుల్ అంటే ఫ్లవరూ కాదు.. పప్పూ కాదు.. ఫైరు. ఢిల్లీ నడిగడ్డకు చేరుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. వైరిపక్షాన్ని గట్టిగానే తాకేసింది. ఎర్రకోట వేదికగా రాహుల్ ఇచ్చిన స్పీచ్.. మోదీ సర్కార్‌కి స్ట్రాంగ్ మెసేజే అయ్యిందా? కన్యాకుమారిలో మొదలు పెట్టా.. కాశ్మీర్ దాకా వెళ్తున్నా.. 2,800 కిలోమీటర్లు నడిచొచ్చా.. నేను చూసిన నా భారత దేశం అపూర్వం అపురూపం.. అంటూ అట్నుంచి నరుక్కొస్తున్నారు కాంగ్రెస్ యువరాజు రాహుల్. గాజు మేడలు దిగొచ్చి జనం గుండెల్ని తాకి చూసి.. రాజకీయ గర్జన ఎలాగో బాగానే వంటబట్టించుకున్నారంటూ కాంప్లిమెంట్లు నమోదౌతున్నాయ్ రాహుల్ మీద.
బీజేపీ ద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది.. 24 గంటలూ హిందూ- ముస్లిమ్‌ల మధ్య ద్వేషాన్నే ఎక్స్‌పోజ్ చేస్తోంది.. కానీ.. నా పాదయాత్రలో నేను తట్టిన ప్రతీ హృదయంలోనూ స్వచ్ఛమైన ప్రేమే కనిపించింది.. అంటూ సెంటిమెంట్ అనే ఆయింట్‌మెంట్‌ని బాగానే ప్రయోగించారు రాహుల్‌గాంధీ. పాదయాత్రతో బిజీగా ఉండి.. వందరోజుల తరువాత తల్లిని కలిసిన రాహుల్.. రెండుచేతులతో ఆమెను చుట్టేసి.. ఫోటోకిచ్చిన ఫోజు.. ఇప్పుడు నేషనల్ ట్రెండింగ్ న్యూస్. అమ్మ నుంచి నేను పొందిన ప్రేమను దేశమంతా పంచిపెట్టి వస్తున్నా.. అనే ట్వీట్‌తో సెంటిమెంట్ ఫ్లేవర్‌ని పీక్స్‌ని చేర్చేశారు రాహుల్.
పార్టీలో పెద్ద కుర్చీని కూడా త్యాగం చేసి.. నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ బాటసారి అవతారమెత్తారు రాహుల్. నువ్వింకా రాటుదేలాలయ్యా అని ఎవరైనా అన్నారో ఏమో.. అలా నేర్చుకునే క్రమంలోనే పాదయాత్రకు నడుంకట్టారు. 3,500 కిలోమీటర్లు..150 రోజులు.. మొత్తం 12 రాష్ట్రాలను చుట్టేస్తూ సాగాల్సిన రాహుల్ పాదయాత్ర.. దాదాపు 75 శాతం ముగిసింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హర్యానా మీదుగా ఢిల్లీ చేరుకున్నారు. పరుగు పందేలు, కబడ్డీ ఆటలు, అప్పుడప్పుడూ ఆలింగనాలు.. కుదిరినప్పుడల్లా ఫ్లయింగ్ కిస్సులు కూడా. వీలైతే ప్రేమిద్దాం డూడ్.. మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు.. అనే కాన్సెప్ట్‌తో జనంలో తిరుగుతున్న రాహుల్. తాను ఆడాల్సిన రాజకీయ క్రీడను కూడా విస్మరించినట్టు లేరు. పార్టీలోని బద్ధశత్రువుల్ని కూడా తన వెంట నడిపించి.. ఆయా రాష్ట్రాల్లో ప్యాచ్ వర్క్ షురూ చేశారు. కర్నాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో నడుస్తూనే పార్టీకి రిపేర్లు చేసుకుంటూ వచ్చారు.
పార్టీకి ఎవ్వరెవరితో అవసరం.. కూటమి కట్టాల్సి వస్తే ఎవరితో వెళ్లాలి.. లాంటి ఎక్సర్‌సైజుల్ని కూడా వదల్లేదు. లేటెస్ట్‌గా లోకనాయకుడు కమల్‌హాసన్.. రాహుల్ మార్క్ ఆఫ్ గాంధీగిరీకి ఫ్లాటైనట్టున్నారు. ఫక్తు కమ్యూనిస్టు భావాలున్న కమల్‌హాసన్.. కాంగ్రెస్‌కి దగ్గరవుతున్నట్టు పాదయాత్రలో సంకేతాలిచ్చేశారు. పాదయాత్రకు ముందు లంచ్ బ్రేక్‌లో దాదాపు 40 నిమిషాల పాటు వీళ్లిద్దరి మధ్య మాటలు నడిచాయి.
ఒక భారతీయుడిగా మాత్రమే రాహుల్ వెంట నడిచా… అని స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ.. కమల్‌హాసన్ పొలిటికల్ మైండ్‌సెట్ కొత్తకొత్త అర్థాల్నిస్తోంది. మా నాన్న కాంగ్రెస్‌వాది అంటూ ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసిన కమల్… తాను కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారా అనే సందేహాలకు తావిచ్చారు. రాహుల్‌తో కలిస్తే పొలిటికల్‌గా కమల్‌హాసన్‌కి నేషనల్ ఎక్స్‌పోజర్ వచ్చే ఛాన్సుంది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఐనా ఔతారు. మరి.. కమల్ కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తాడా? తన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా.? లేక మద్దతునివ్వబోతున్నారా అనే చర్చ మొదలైంది తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో.
గతంలో ఎంజీఆర్ కూడా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేశారు. రాజకీయమైత్రితోనే ఉండేవారు. ఎంజీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు కమల్ నడవబోతున్నారా? ఇదే జరిగితే ద్రవిడగడ్డపై కాంగ్రెస్‌కి బూస్ట్ దొరికినట్టే. ప్రస్తుతం స్టాలిన్‌తో ఫ్రెండ్‌షిప్‌లో ఉన్న కాంగ్రెస్‌పార్టీకి కమల్ తోడు దొరికితే.. అక్కడ రాజకీయ సమీకరణాలు సమూలంగా మారే ఛాన్సుంది. కమల్ అండ్ కాంగ్రెస్.. థర్డ్ పవర్‌సెంటర్‌గా ఎదగబోతున్నట్టు అప్పుడే వార్తలొచ్చేస్తున్నాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు రాహుల్ భారత్ జోడో యాత్ర. మోదీ సర్కార్‌ను చాకిరేవు పెడుతూ.. మంది మనసుల్ని దోచుకుంటూ.. దూసుకెళ్తున్న రాహుల్.. తనకున్న పప్పు అనే నిక్‌నేమ్‌ని తుడిపేసుకుని ఫైర్‌బ్రాండ్‌గా ట్రాన్స్‌ఫామ్ అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..