ఢిల్లీ, 08 జనవరి 2025: దేశ రాజధాని ఢిల్లీలోని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయం చిరునామా మారనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌గా సేవలందించిన అక్బర్ రోడ్‌లోని 24వ నెంబర్ బంగ్లా నుంచి మరో ప్రాంతానికి పార్టీ కార్యాలయం తరలిపోనుంది. ల్యూటెన్స్ ఢిల్లీగా వ్యవహరించే సెంట్రల్ ఢిల్లీ నుంచి పార్టీ కార్యాలయం 9A, కోట్లా మార్గ్ చిరునామాకు మారనుంది. అక్కడ 2009లో ప్రారంభించిన పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం పూర్తిచేసుకుని చాలా రోజులైనప్పటికీ.. తుది మెరుగులు దిద్దుకోవడంలో జాప్యం జరిగింది. మొత్తంగా ఆ భవనానికి ఇప్పుడు మోక్షం లభించడంతో ఒకట్రెండు నెలల్లో ఆ భవనాన్ని ప్రారంభించేందుకు ఏఐసీసీ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది.
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తున్న 24, అక్బర్ రోడ్ భవంతి ఢిల్లీలోని పాలనా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉంది. ల్యూటెన్స్ ఢిల్లీగా వ్యవహరించే ఈ ప్రాంతంలో పాలనా భవనాలతో పాటు పాలకులు, ఉన్నతాధికారుల నివాస భవనాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఓ ప్రభుత్వ బంగ్లాను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా మార్చుకుని ఉపయోగించుకుంటోంది. ఇదే మాదిరిగా 11, అశోక రోడ్ బంగ్లాను భారతీయ జనతా పార్టీ (BJP) కొన్ని దశాబ్దాల పాటు ప్రధాన కార్యాలయంగా మార్చుకుని వినియోగించుకుంది. ల్యూటెన్స్ ఢిల్లీలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నాటి ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో వివిధ రాజకీయ పార్టీలకు స్థలాలను కేటాయించింది. ఈ క్రమంలో బీజేపీ తమకు కేటాయించిన స్థలంలో అధునాతన సదుపాయాలతో ఓ భవనాన్ని నిర్మించుకుని, పార్టీ కార్యాలయాన్ని 11 అశోక రోడ్ నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) మార్గ్‌కు మార్చుకుంది. అయితే బీజేపీ కంటే చాలా ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ కూడా డీడీయూ మార్గ్‌లో తమకు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టింది. 2009లో చేపట్టిన ఆ నిర్మాణం 2014 తర్వాత పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో నత్తనడకన సాగింది. మొత్తానికి అదిప్పుడు పూర్తికావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
అయితే 130 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయం నేటి ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్)లో ఉండేది. దాన్ని స్వరాజ్ భవన్‌గా వ్యవహరించేవారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి న్యూఢిల్లీ నగరాన్ని రాజధానిగా ఎంచుకున్న తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో 7, జంతర్ మంతర్ భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకుంది. 1969లో పార్టీలో చీలక రాగా, ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ తాత్కాలిక భవనాల్లో కొన్నాళ్లు పార్టీని నడిపి చివరకు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఓటమి అనంతరం 1978లో 24, అక్బర్ రోడ్ బంగ్లాను పార్టీ ప్రధాన కార్యాలయంగా మార్చుకుంది. అప్పటి నుంచి ఈ బంగ్లాయే ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌గా సేవలందిస్తూ వస్తోంది. ఈ బంగ్లాకు ఆనుకుని పక్కనే ఉన్న 10, జన్‌పథ్‌ను సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నివాస భవంతిగా కేటాయించగా.. ఇప్పటికీ ఆ నివాసంలో సోనియా నివాసం ఉంటున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్కపక్కనే ఉన్న 10, జన్‌పథ్ – 23, అక్బర్ రోడ్ బంగ్లాకు కీలక వ్యవహారాలకు, నిర్ణయాలకు కేంద్ర బిందువులుగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన అనేక చర్చలు, నిర్ణయాలకు కూడా ఈ జంట భవనాలే వేదికలయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయ భవనం నిర్మించింది దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోనే కావడంతో దాని చిరునామా కూడా అదే అవుతుంది. అయితే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నేత పేరు మీద ఉన్న చిరునామాలో కాంగ్రెస్ పార్టీ ఉండడాన్ని ఆ పార్టీ ఇష్టపడినట్టు లేదు. అందుకే వెనుక ద్వారం కోట్లా మార్గ్‌లో ఉంటుంది. వెనుక ద్వారమే ప్రధాన ద్వారంగా మార్చుకుంటే.. 9A, కోట్లా మార్గ్ ఇప్పుడు ఆ భవంతికి అధికారిక చిరునామాగా మారుతుంది. దాంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఏఐసీసీ కార్యాలయం చిరునామా రాసుకునే వెసులుబాటు ఏర్పడింది. మొత్తం 6 అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనాన్ని అప్పట్లో అహ్మద్ పటేల్, మోతీలాల్ ఓరా వంటి పార్టీ అగ్రనేతలు ఆర్కిటెక్టులతో డిజైన్ చేయించి మరీ నిర్మాణం ప్రారంభించారు. సోనియా గాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. పటేల్, ఓరా వంటి నేతలు ఇప్పుడు జీవించి లేకపోయినా.. వారి హయాంలో మొదలైన భవనం ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంది.