నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని ఈడీ(ED) విచారించడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్(Congress) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను ముట్టడించారు. ఉదయం 3 గంటల పాటు విచారించిన ఈడీ.. లంచ్ బ్రేక్ తరువాత ప్రశ్నల పరంపర కొనసాగించింది. ది. యంగ్ ఇండియా బ్యాంక్ ఖాతాల పైనే ప్రధానంగా రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కొన్ని షెల్ కంపెనీల నుంచి ఈ ఖాతాలకు డబ్బులు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. రాహుల్ ఈడీ విచారణ సందర్భంగా.. ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. రాహుల్‌తో పాటు ఈడీ కార్యాలయానికి ర్యాలీకి బయలుదేరిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కూడా తోపులాటలో గాయపడ్డారు.
రాహుల్‌గాంధీని కావాలనే టార్గెట్ చేశారని ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. ప్రధాని మోదీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అవినీతికి మద్దతుగా ఆయన పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అగ్రనేతలు వచ్చారని ఆరోపించారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఢిల్లీ తుగ్లక్ రోడ్ పోలీసుస్టేషన్ చేరుకున్నారు. అరెస్టైన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఆమె పరామర్శించారు. ఈడీ విచారణకు రాహుల్‌తో పాటు బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. తుగ్లక్‌రోడ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసీ వేణుగోపాల్‌ను కూడా ప్రియాంక పరామర్శించారు.
పోలీసులు చాలా అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసుల తోసేయడంతో తనకు గాయమైనట్టు బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ కార్యదర్శ సంపత్‌కుమార్‌కు కూడా తోపులాటలో గాయాలయ్యాయి.