Congress MLAs tried to attack Governor Dattatreya: రాజ్యాంగబద్దమైన పదవుల్లో వున్న వారి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు ఈ మధ్య కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవడం, ప్రసంగ ప్రతులను చించి పారేయడం.. సభలో అభ్యంతరకరంగా నినాదాలు చేయడం.. చట్టసభల్లో తరచూ జరుగుతూనే వుంది. తాజాగా ఇలాంటి ఉదంతమే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోను చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌లగా వ్యవహరిస్తున్న బండారు దత్తాత్రేయ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు. దాదాపు ఆయనపై దాడి చేసినంత పని చేశారు. ఈ ఉదంతంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో ఈ అనుచిత ఉదంతం శుక్రవారం (ఫిబ్రవరి 26న) చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ సభనుద్దేశించి ప్రసంగించేందుకు వచ్చారు. అయితే.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు సభలో హంగామా సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అస్సలు కొనసాగనీయకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని చక్క దిద్దేందుకు స్పీకర్ ఎంతగా ప్రయత్నించినా కాంగ్రెస్ సభ్యులు తమ నినాదాలను ఆపలేదు. ప్రసంగాన్ని కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో గవర్నర్ దత్తాత్రేయ.. తన ప్రసంగ ప్రతిలోని చివరి వ్యాఖ్యలను మాత్రం చదివి… ప్రసంగాన్ని మమ అనిపించి అక్కడ్నించి బయలు దేరారు. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ సభ్యలు గవర్నర్ దారిని అటకాయించారు. తన ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బండారు దత్తాత్రేయను నెట్టేశారు. మార్షల్స్, సెక్యురిటీ సిబ్బంది సహాయంతో దత్తాత్రేయ అక్కడ్నించి నిష్క్రమించగలితారు.
కాగా ఈ అనుచిత ఉదంతంపై భారతీయ జనతాపార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో అనుచితంగా ప్రవర్తించిన నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో బీజేపీ సభ్యులు తీర్మానాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్ భరద్వాజ్ తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఆ పార్టీ ఖండించింది. గవర్నర్‌ను నెట్టేసిన ఘటనను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఖండించారు. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఉదంతంపై రాజ్‌భవన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో వున్న వారిపట్ల గౌరవంగా వ్యవహరించాల్సి వుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల తొలి రోజున చట్ట సభలనుద్దేశించి జాతీయ స్థాయిలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రాల స్థాయిలో అయితే గవర్నర్లు ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. రాజకీయాల సంగతి ఎలా వున్నా.. గవర్నర్ ప్రసంగాల సమయంలో హుందాగా వుండడం గతంలో సంప్రదాయంగా వుండేది. కానీ తాజాగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్ళుగా.. తొలి రోజు నుంచే సభలో పైచేయి సాధించాలన్న పొలిటికల్ వ్యూహాలకే విపక్షలు పెద్ద పీట వేస్తున్నాయి. అదే సమయంలో విపక్షాన్ని మొదటి రోజు నుంచి కార్నర్ చేయాలని అధికార పక్షాలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవడం, ప్రసంగ ప్రతులను చించి వేయడం, సభలో నానా హంగామా సృష్టించి.. ప్రసంగాన్ని కొనసాగించకుండా చేయడం వంటి గత కొన్నేళ్ళుగా దేశంలో కామనైపోయాయి. దీనికి తాజాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన అనుచిత ప్రవర్తన ఓ ఉదాహరణగా నిలుస్తోంది.
ALSO READ: వైజాగ్‌లో ఎక్కువ.. గూడూరులో తక్కువ..లెక్కలతో పార్టీలు బిజీబిజీ
ALSO READ: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!
ALSO READ: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?