కాంగ్రెస్ పార్టీ.. దాదాపు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. అయితేనేం.. ఎంతటి భారీ వృక్షమైనా.. తుఫాన్ దాటికి ఒరిగిపోక తప్పదన్నట్లు.. గత ఎన్నికల్లో మోదీ తుఫాన్ ముందు.. ప్రతిపక్ష హోదా కూడా రాకుండి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ ఘోర పరాభవం తర్వాత.. పార్టీ పగ్గాలు చేపడుతున్న రాహుల్ గాంధీ.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవిని ఎవరు చేపడుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులు వద్దని వారిస్తున్నా.. రాహుల్ గాంధీ మాత్రం మొండిగా వ్యవహరించి.. తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ.. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా.. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎక్కువ చేయకున్నా.. సీట్లు మాత్రం సాధించింది. దీంతో మళ్లీ పార్టీ అధినాయకత్వం ఆలోచనలో పడింది. మళ్లీ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపడితే.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొవచ్చన్న అభిప్రాయం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో.. ఆ పార్టీ కీలక నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ.. మళ్లీ చేపట్టనున్నారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ చేపట్టడం తప్పనిసరి అని.. ఇదే విషయమై పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తిని.. రాహుల్ గాంధీ అంగీకరిస్తారని అభిప్రాయపడ్డారు.
కాగా, రాహుల్ తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయన వెంట ఉన్న కేసీ వేణుగోపాల్.. ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ఏఐసీసీ సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీని.. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు మరో కీలక నేత చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు.. రాహుల్ గాంధీ చేపట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది.