తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ప్రధానంగా.. దక్షిణ తమిళనాడులోని నాలుగు జిల్లాలు వరదలతో వణికిపోయాయి. అయితే.. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద విలయం కొనసాగుతోంది. వరద తగ్గినప్పటికీ.. బురద మాత్రం బాధితులను భయపెడుతోంది. అటు.. వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న సీఎం స్టాలిన్.. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వర్ష బీభత్సం, వరద కారణంగా తమిళనాడులోని తిరనల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.
ముఖ్యంగా.. తామ్రపర్ణి నది ఉధృతంగా ప్రవహించడంతో ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊరేదో, చెరువేదో అర్థం కానంతగా వరద నీరు ముంచెత్తింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ దృశ్యాలే నిదర్శనం. దాదాపు పది అడుగులకు పైగా వరద ప్రవహించి.. ఇళ్లలోని మొదటి అంతస్తు మొత్తం నీటిలో మునిగిపోయింది. దాంతో.. ఇళ్లలోని సామానులు, నిత్యవసరాలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. నీటితో నాని.. కొన్ని ఇళ్లు కూలిపోగా.. మరికొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరాయి.
గత మూడు రోజులుగా దక్షిణ తమిళనాడులో నదులను తలపించిన పంట పొలాల్లో వరద తగ్గింది. అయితే.. ఇక్కడ పంట పొలాలకు దూరంగా సుమారు 30 అడుగుల ఎత్తులో ఉన్న గ్రామాల్లోనూ వరద నీరు ప్రవహించిందంటే స్థానికులు ఎంత భయకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. వరద ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోయాయి. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. తిరునల్వేలి జిల్లాలో ఊర్లకు ఊర్లే మునిగిపోయాయి. వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జి దెబ్బతింది. బిడ్జి నిర్మాణంలో సపోర్ట్‌గా పెట్టిన ఐరన్ పిల్లర్స్ కొట్టుకుపోయాయి. బ్రిడ్జి దగ్గర నిలిపి ఉంచిన క్రేన్లకు పైనుంచి వరద నీరు ప్రవహించిన పరిస్థితులు చూస్తే గుండె గభేల్ మంటోంది.
ఇక.. వరద తగ్గడంతో ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుంచి గ్రామాలకు చేరుకుంటున్నారు బాధితులు. అయితే.. వరద తగ్గినా.. వరద ముగిల్చిన బురదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఇళ్లన్నీ నీట మునగడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో.. ఆహారం కోసం వరద ప్రభావిత గ్రామాల బాధితులు నానా అవస్థలు పడుతున్నారు.
కొన్ని చోట్ల హెలీకాఫ్టర్ల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు.. భోజనం, పాల ప్యాకెట్లు లాంటివి అందిస్తున్నాయి. ఆహార పొట్లాల కోసం జనాలు ఎగబడ్డారు. మొత్తంగా.. దక్షిణ తమిళనాడులో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలతో.. గ్రామాలకు గ్రామాలనే వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్ష బీభత్సం, వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తోంది తమిళనాడు ప్రభుత్వం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..