కర్నాటక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్ని పార్టీల నేతలు. బీజేపీ తరపున సీఎం బస్వరాజ్ బొమ్మైతో పాటు పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ , బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు బొమ్మై. కర్నాటక ప్రజలు ఓట్లతో కాంగ్రెస్‌కు బుద్ది చెబుతారని అన్నారు. బీజేపీ అభ్యర్ధుల తరపున కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ ప్రచారాన్ని నిర్వహించారు. కర్నాటకకు మరోసారి బస్వరాజ్ బొమ్మై సీఎం కావడం ఖాయమన్నారు కిచ్చా సుదీప్. రాణి బెన్నూర్‌లో సుదీప్ రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినప్పటికి కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందన్నారు డీకే శివకుమార్.
మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న కేంద్రమంత్రులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బీజేపీ సిద్దాంతాలు విషసర్పంతో సమానమని తాను చేసిన వ్యాఖ్యలకు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పరిమితిని 75 శాతానికి పెంచుతామని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు గైడెన్స్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు వివరించారు. కర్నాటక బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోదీ. బీజేపీ గెలుపుకు బూత్ లెవెల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమన్నారు మోదీ. ఓటర్లను పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకొచ్చే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఈవిషయంలో కార్యకర్తలు విజయం సాధిస్తే పార్టీ గెలుపు ఖాయమన్నారు. కర్నాటకలో శనివారం మోదీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తారు. బెంగళూర్‌లో 4 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో (కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023) గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ గాంధీ గురువారం ప్రకటించారు . మంగళూరు అడయార్ సమీపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ మహిళల కోసం మరో పథకాన్ని ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదో హామీ ఇది. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఐదు హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం