Karnataka Elections: మహా రంజుగా కన్నడ రాజకీయం.. సర్వేలతో ప్రధాన పార్టీలు డీలా.. వచ్చే పది రోజులు అత్యంత కీలకం
తాజాగా వెల్లడైన ప్రీపోల్ సర్వేలు కర్నాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయి. టీవీ9-సి ఓటర్ సర్వే మినహాయించి మిగిలిన అన్ని సర్వేలు కర్నాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందని...
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అంశం ఇప్పుడు యావత్ భారత దేశ ప్రజలను ఆకర్షిస్తుంది. గత ఐదేళ్లపాటు కర్నాటక రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ అనుసరించిన వ్యూహాలను దగ్గరనుంచి పరిశీలించిన వారు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ఓటర్లు ఎవరి పట్ల సానుకూలత కనబరుస్తారన్నది ఆసక్తిగా చూస్తున్నారు. 2018 లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ మార్కును దాటకపోవడంతో.. ఆ తర్వాత ఐదేళ్లపాటు కన్నడ నాట పలు రాజకీయపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని చీల్చి మరి కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని నెలల పాటు క్యాంపు రాజకీయాలతో కొనసాగిన కర్ణాటక పాలిటిక్స్ అప్పట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాయి. ఎట్టకేలకు కోర్టుల తీర్పులు, వ్యూహాల ఫలితాల కారణంగా గత రెండేళ్లుగా కర్నాటకలో బిజెపి ప్రభుత్వం కొనసాగుతోంది. ఎన్నో మంత్రాంగాల తర్వాత దక్కించుకున్న కర్నాటక పాలనా పగ్గాలను తిరిగి చేపట్టేందుకు తాజా ఎన్నికలలో బిజెపి యధాశక్తి ప్రయత్నిస్తుంది. అయితే వ్యూహాల్లో భాగంగా బిజెపి చాలామంది సిట్టింగులకు మళ్ళీ అవకాశం కల్పించలేదు. అదే సమయంలో సీనియర్ నేతలకు కూడా మొండి చేయి చూపాల్సి వచ్చింది. కన్నడ రాజకీయ దిగ్గజం యడియూరప్ప తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం తాను త్యాగాలకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం నిర్దేశించిన పనులకే పరిమితమై పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఆయన ప్రభావం లింగాయత్‌లపై కచ్చితంగా వుంటుంది. పైకి నర్మగర్భంగా వుంటున్న యడియూరప్ప తమ సామాజిక వర్గానికి అంతర్లీనంగా ఎలాంటి సందేశం పంపుతారన్నదిపుడు కీలకం. ఆయన పార్టీ పట్ల విధేయతను కొనసాగిస్తే లింగాయత్ సామాజిక వర్గం బిజెపిని వీడదు. లేకపోతే బిజెపి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. యడియూరప్ప సంగతిలా వుంటే.. గతంలో ముఖ్యమంత్రి పదవినిచ్చిన బిజెపి అధిష్టానం… తాజా ఎన్నికల్లో తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో జగదీష్ షట్టర్ లాంటి సీనియర్ నేతలు పార్టీని వీడిపోయారు. కర్నాటక కోస్టల్ ఏరియాలో తమకు బాగా పట్టున్న ప్రాంతంలో ఇప్పుడు బిజెపి కొంత బలహీనంగా కనిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా వెల్లడైన ప్రీపోల్ సర్వేలు కర్నాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయి. టీవీ9-సి ఓటర్ సర్వే మినహాయించి మిగిలిన అన్ని సర్వేలు కర్నాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందని చాటాయి. టీవీ9-సి ఓటర్ సర్వే మాత్రం మిగిలిన సర్వేలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దక్కుతుందని అంచనా వేసింది. టీవీ9-సీ ఓటర్ సర్వే ప్రకారం తాజా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 106 నుంచి 116 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 79 నుంచి 89 స్థానాలు, జెడిఎస్ పార్టీ 24 నుంచి 34 స్థానాలను గెలుచుకుంటాయని వెల్లడించింది.
224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 మ్యాజిక్ మార్కును దాటాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా వివిధ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వేల ప్రకారం చూస్తే అక్కడ ఏ పార్టీ కూడా మేజిక్ మార్క్ అయిన 113 నెంబర్ను దాటే సంకేతాలు కనిపించడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో కర్నాటకలో బిజెపి, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఇందులో జెడిఎస్ దక్షిణ కర్నాటక ప్రాంతంలో కొన్ని జిల్లాలకే పరిమితం కాగా కాంగ్రెస్, బిజెపి మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో సై అంటే సై అని తలబడుతున్నాయి. అయితే తాజాగా వెల్లడైన సర్వే గణాంకాలు మూడు పార్టీలను కొంత నిరాశలో పడేసినట్లు కనిపిస్తోంది. ఏ పార్టీకి మెజార్టీ రాబోదని ఈ సర్వేలు వెల్లడించడంతో మే 13 ఎన్నికల ఫలితాల తర్వాత జెడిఎస్ పార్టీ రోల్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కాబోతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోను ఇలాంటి ఫలితాలే రాగా కాంగ్రెస్, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదు. బిజెపి నెలల తరబడి సాగించిన మంత్రాంగంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి, బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం అధికార పార్టీగా బిజెపి ఈ ఎన్నికల్లో తలపడుతుంది. సిట్టింగ్ సీఎం బసవరాజ్ బొమ్మైకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
వివిధ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలను పరిశీలిస్తే… ది ఏషియా నెట్ సువర్ణ న్యూస్ జన్‌కీ బాత్ సర్వే ప్రకారం బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. బీజేపీకి 98 నుంచి 109 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 89 నుంచి 97 సీట్లు, జేడీఎస్ కు 28 నుంచి 39 సీట్లు దక్కుతాయని ది ఏషియానెట్ సువర్ణ న్యూస్ జన్‌కీ బాత్ సర్వే వెల్లడించింది. ది న్యూస్ ఫస్ట్ మాట్రిజ్ సర్వే ప్రకారం బిజెపి 96 నుంచి 106 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 84 నుంచి 94 స్థానాలు, జెడిఎస్ పార్టీ 29 నుంచి 34 స్థానాలు దక్కించుకోనున్నాయి. విస్తారా న్యూస్ సౌత్ పీపుల్ సర్వే ప్రకారం బిజెపికి 88 నుంచి 93 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 84 నుంచి 90 స్థానాలు, జెడిఎస్ పార్టీకి 23 నుంచి 26 స్థానాలు దక్కుతాయి. ది సౌత్ ఫస్ట్ చేపట్టిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 105 స్థానాలు, బిజెపి 90 నుంచి 100 స్థానాలు, జెడిఎస్ పార్టీకి 25 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటాయి. అయితే ఈ మీడియా, సర్వే సంస్థ లేవి కన్నడ నాట ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది తమ సర్వే నివేదికల్లో వెల్లడించకపోవడం విశేషం. నిజానికి నెల రోజుల క్రితం వెల్లడైన ఒపీనియన్ పోల్ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని పలు సంస్థలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల నోటిఫికేషన్ విలువడి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత గాలి దిశ మారినట్లు తాజా ప్రీపోల్ సర్వేలు చాటుతున్నాయి. మే 8వ తేదీ నాటికి ఎన్నికల ప్రచారం ముగియనున్నది. దాంతో ఈ పది రోజులు ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు అత్యంత కీలకం కాబోతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అధినేతలంతా కర్నాటకపై దృష్టి సారించిన నేపథ్యంలో వచ్చే పది రోజుల్లో ఓటరు నాడి ఏ మేరకు మారుతుంది అన్నది చర్చనీయాంశంగా కనిపిస్తోంది. ఏఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కన్నడ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ఇవి తొలి పెద్ద ఎన్నికలు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టడం ద్వారా తన నాయకత్వ పటిమను ఖర్గే చాటుకోవాల్సిన అగత్యం ఆయనకుంది. అయితే ఆయన ప్రభావం ఉత్తర కన్నడ జిల్లాలకు మాత్రమే పరిమితం అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతోపాటు బిజెపి కీలక నేతలంతా కర్నాటకలో తరచూ పర్యటిస్తున్నారు. 50 మందితో బిజెపి స్టార్ క్యాంపెయినర్లను నియమించి, వారికి నియోజకవర్గాల వారీగా బాధ్యతలప్పగించింది. వారంతా ప్రచారంలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పది రోజుల్లో ఓటరు అభిప్రాయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది వేచి చూడాలి.