రేప్ కేసుల విచారణ.. ఇద్దరు ‘ సుప్రీం ‘ న్యాయమూర్తులతో కమిటీ
దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను సత్వరం విచారించేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో ఓ కమిటీని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే నియమించారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి, జస్టిస్ ఎం. ఆర్. షా లతో కూడిన ఈ కమిటీ.. ఈ కేసుల విచారణకు సంబంధించి తగిన సూచనలు కూడా చేయనుంది. ఆయా కేసుల విచారణను పర్యవేక్షించనుంది . మొదట ఇది.. ట్రయల్ కోర్టుల్లో పెండింగులో ఉన్న ఎఫ్ఐ ఆర్ లు, […]
దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను సత్వరం విచారించేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో ఓ కమిటీని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే నియమించారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి, జస్టిస్ ఎం. ఆర్. షా లతో కూడిన ఈ కమిటీ.. ఈ కేసుల విచారణకు సంబంధించి తగిన సూచనలు కూడా చేయనుంది. ఆయా కేసుల విచారణను పర్యవేక్షించనుంది . మొదట ఇది.. ట్రయల్ కోర్టుల్లో పెండింగులో ఉన్న ఎఫ్ఐ ఆర్ లు, చార్జిషీట్ల వివరాలను కోరుతుందని, అనంతరం చీఫ్ జస్టిస్ కి తమ నివేదికను అందజేస్తుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో దిశ హత్యాచారం ఘటనతో బాటు దేశంలో మహిళలు, ఆడపిల్లలపై వరుసగా జరుగుతున్న దారుణ నేరాల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటయింది. ఈ నేరాలకు సంబంధించి కోర్టుల్లో లక్షా 66 వేల కేసులు పెండింగులో ఉన్నాయి. వీటి సత్వర విచారణకు 1,023 స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా న్యాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కలిసి ఓ పథకాన్ని రూపొందించాయని , ఇతర కేంద్ర ఆధ్వర్యంలోని పథకాల మాదిరే ఇది కూడా ఉంటుందని ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ఓ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. స్పెషల్ కోర్టుల ఏర్పాటుకురూ. 767.25 కోట్లు అవసరమవుతాయని అంచనా అని, ఇందులో కేంద్రం తన వాటాగా రూ. 474 కోట్లను అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ నిధులు నిర్భయ ఫండ్ నుంచి అందుతాయన్నారు. యూపీలో ఇటీవలే రెండు వందలకు పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.