షిర్డీ, జనవరి 22: ‘అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ… దేశమే దేవాలయంగా మారిపోయింది. భక్త జనమే కాదు… ఆలయాలు కూడా అంతా రామ మయం అంటున్నాయి. సాయి నగరి షిర్డీ కూడా రామ నామ జపంతో ఊగిపోతోంది. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట శుభ ఘడియల వేళ దేశం మొత్తం భక్తి భావంతో తన్మయత్వం చెందుతోంది. పెద్దాచిన్నా ఆడామగా ముసలీముతకా అందరూ… అంతా రామ మయం..ఈ జగమంతా రామ మయం అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అసోం నుంచి గుజరాత్ దాకా భారతదేశం రామ ప్రదేశంగా మారిపోయింది. దేశమే దేవాలయంగా మారిపోయింది. ఎక్కడ విన్నా రామ నామమే. ఎక్కడ చూసినా రామ మయమే అన్నట్లుంది పరిస్థితి. ఇక జనమే కాదు… ఆలయాలు కూడా రామ నామంతో ఊగిపోతున్నాయి. భక్తులు శ్రీరామచంద్రుడి భజనలు, కీర్తనలతో హోరెత్తిస్తున్నారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో దేశమంతా రామచంద్ర ప్రభువు భక్తిలో మునిగితేలుతోంది.
ఇక సాయి నగరి షిర్డీ కూడా రామమయంగా మారింది. రామ నామంతో హోరెత్తిపోతోంది. షిర్డీ సాయిబాబా నగరం కూడా బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు రెడీ అయింది. సాయి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో, దీపాలతో అందంగా అలంకరించారు. షిర్డీ సాయిబాబా తన జీవితంలో నిరుపేదలకు, అనాథలకు, అభాగ్యులకు సేవలు అందించారు. తనను పరిపూర్ణంగా నమ్మి భారాన్ని తనపై వేస్తే కాపాడతానంటూ తన భక్తులకు షిర్డీ సాయి అభయమిచ్చారు. తన భక్తుల ఇంట్లో ఏ కొరతా ఉండదంటూ ఆయన ఆశీర్వదించారు. సాయినాథుడి దర్శనం కోసం షిర్డీకి నిత్యం వేలమంది భక్తులు వస్తుంటారు. అలాంటి షిర్డీ నగరం కూడా ఇప్పుడు రామ కీర్తనలతో మార్మోగుతోంది. షిర్డీలో ద్వారకామాయి వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి బాబా చూపిన బాటలో పయనిస్తూ వృద్ధాశ్రమం ద్వారా అనాథలు, వృద్దులకు సేవలు అందిస్తున్నారు.
శ్రీ రామ్‌లల్లా విగ్రహ స్థాపన సందర్భంగా, ద్వారకామాయి వృద్ధాశ్రమం కూడా భక్తి భావంలో మునిగిపోయింది. గత 10 రోజులుగా ఆశ్రమంలో ప్రతిరోజూ 11 గంటల పాటు శ్రీరామ్ జై రామ్ జైజై రామ్ అంటూ వృద్ధులంతా రామ నామ సంకీర్తన చేస్తున్నారు. ఇక అయోధ్యలో బాల రామ మూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆశ్రమంలో పెద్ద స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రామ నామ స్మరణతో పండుటాకులు తన్మయత్వం చెందుతున్నారు.
మరిన్ని అయోధ్య రాయాలయం వార్తల కోసం క్లిక్ చేయండి.