AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ‘మేమూ బాధపడ్డాం.. భారత్‌కు సాయం చేసేందుకు సిద్దం..’ చైనా కీలక ప్రకటన

భారతదేశానికి సహాయం చేయడానికి చైనా చేసిన ప్రతిపాదన ద్వారా వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో బీజింగ్ అనుభవాలను భారత్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. గత దశాబ్దంలో చైనా పరిశ్రమలను మార్చడం, వాహన ఉద్గారాలను నియంత్రించడం, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని విస్తరించడం వంటి చర్యలను వేగంగా అమలు చేసింది.

Delhi: 'మేమూ బాధపడ్డాం.. భారత్‌కు సాయం చేసేందుకు సిద్దం..' చైనా కీలక ప్రకటన
Delhi Pollution
Gopikrishna Meka
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 06, 2025 | 7:53 AM

Share

కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగుపరిచేందుకు తమవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ముందుకొచ్చింది. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యుజింగ్ ఎక్స్ వేదికగా దీనిని ప్రకటించారు. చైనా కూడా ఒకప్పుడు తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బంది పడింది. కానీ ప్రస్తుతం కాలుష్యం నుంచి బయటపడింది. ఆ అనుభవాలు తమ ప్రయాణాన్ని భారత్‌తో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గతంలో చైనాలో కాలుష్యం ఏవిధంగా ఉండేది. ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందనే ఫోటోలను, కాలుష్య నియంత్రణకు చైనా తీసుకుంటున్న చర్యలు పోస్ట్ చేశారు.

భారతదేశానికి సహాయం చేయడానికి చైనా చేసిన ప్రతిపాదన ద్వారా వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో బీజింగ్ అనుభవాలను భారత్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. గత దశాబ్దంలో చైనా పరిశ్రమలను మార్చడం, వాహన ఉద్గారాలను నియంత్రించడం, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని విస్తరించడం వంటి చర్యలను వేగంగా అమలు చేసింది. ఈ చర్యలు బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో పొగమంచు స్థాయిలను తగ్గించడంలో కీలకంగా నిలిచాయి.

భారత్, చైనా ఒకే విధమైన పట్టణ కాలుష్య సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, స్వచ్ఛమైన గాలి సాంకేతికతలు, డేటా మార్పిడి, కర్బన ఉద్గార నియంత్రణ వ్యూహాలపై సహకారం రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కొంతమంది నిపుణులు మాత్రం ఈ ప్రకటనను ఒక దౌత్యపరమైన సంజ్ఞగా చూస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో చైనా నుంచి సహకార సందేశం దౌత్య సంబంధాలను బలోపేతం, పర్యావరణ విషయంలో కలిసి పనిచేయడాన్ని సూచిస్తుందని అంటున్నారు.

కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకున్న చైనా..

ఒకప్పుడు చైనా సైతం కాలుష్యంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంది. చైనా రాజధాని బీజింగ్‌తో పాటు పలు నగరాలు, పారిశ్రామిక కేంద్రాల్లో కాలుష్యం ప్రపంచ రికార్డులు సృష్టించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలుష్య నియంత్రణ చర్యలు ముమ్మరం చేయడంతో చైనా నగరాలు కాలుష్యం నుంచి బయటపడ్డాయి. అందుకోసం చైనా గాలి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించి వాటిని ఖచ్చితంగా అమలు చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు, శిక్షలు విధించింది. దశాబ్దకాలంగా అనుసరిస్తున్న క్లీన్ ఎయిర్ పాలసీ కారణంగా చైనా నగరాల్లో గాలి నాణ్యత ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా మెరుగుపడిందని యు జింగ్ తెలిపారు.

చైనా తీసుకున్న చర్యల్లో చిన్న, అసమర్థమైన బొగ్గు బాయిలర్లను మూసివేయడం అధిక కాలుష్యం కలిగించే ప్లాంట్లను వేరే చోటుకి తరలించారు. భారీ పరిశ్రమలు వాహనాలకు కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఏర్పాటు చేశారు. పవన, సౌర జల విద్యుత్ కేంద్రాలను విస్తరించారు. గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి ఉపగ్రహ డేటా రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించకపోతే కఠినంగా శిక్షలు,జరిమానాలు అమలు చేశారు. చైనా విద్యుత్ వాహనాలు, పవన, సౌర విద్యుదుత్పత్తిపై భారీగా పెట్టుబడులు పెట్టింది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు కాలుష్యకారక కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేసింది. భారత్ కూడా వాయు కాలుష్య నియంత్రణకు ఇదేస్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. కర్బన ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలు విద్యుదుత్పాదన, రవాణా రంగాలున్నాయి. వీటిలో మార్పులు వస్తే ఖచ్చితంగా భారత్ కాలుష్య స్థాయిల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత్ ఎలక్ట్రిక్ వాహనాలు సౌర విద్యుత్‌పై దృష్టి సారించినప్పటికీ కాలుష్య నియంత్రణ విషయంలో చైనా అంత కఠినంగా మాత్రం లేదు.

భారత నిర్ణయంపై ఉత్కంఠ

ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చైనా సాయంపై భారత్ అధికారికంగా స్పందించలేదు. భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతల చర్చలు సాగుతున్న వేళ పర్యావరణ హితం కోసం చైనా ఇచ్చిన ఆఫర్‌పై భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రతి శీతాకాలం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య ప్రభావం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దగ్గు, కళ్ళ మంటలు,శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. AQI లెవెల్స్ ఢిల్లీలో రెండు వారాలుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నాయి. సగటున 300-400 పాయింట్లకు మధ్య వాయు నాణ్యత నమోదవుతుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగితే కాలుష్య ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఏ దేశమైనా ఏ విషయంలో అయినా మంచి చర్యలు తీసుకున్నప్పుడు వాటిని ఇతర దేశాలు అమలు చేస్తుంటాయి. మరి ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చైనా ఆఫర్‌పై భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.