చత్తీస్‌ఘడ్, జనవరి 14: అయోధ్యలో ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాల రామ విగ్రయ ప్రాణ ప్రతిష్ట జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలువురికి ప్రత్యేక ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ ఆహ్వానితుల్లో ఓ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 700లకు పైగా పోస్టుమార్టంలు నిర్వహించిన సంతోషి దుర్గ అనే అటాస్పి అసిస్టెంట్‌కు రామ్ మందిర్ ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఈ మహిళ పేరు దేశ వ్యప్తంగా మారుమ్రోగిపోతుంది. దీంతో సంతోషి దుర్గ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. తనకు ఇలాంటి అదృష్టం దక్కుతుందని ఎన్నడూ ఊహించలేదని సంతోషం వ్యక్తం చేసింది. సాక్షాత్తూ ఆ రాముడే తనకు ఆహ్వానం పంపాడంటూ భావోద్వేగానికి లోనైంది. తనను ఆహ్వానించి నందుకు గాను ప్రధాని మోదీకి, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నర్హర్‌పూర్‌కు చెందిన సంతోషి దుర్గ (35) నర్హర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్యంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపు 18 సంవత్సరాలుగా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇప్పటి వరకూ 700కుపైగా పోస్టుమార్టంలు నిర్వహించడం విశేషం. ఆమె చేసిన కృషికిగానూ వివిధ సంఘాల నుంచి గుర్తింపు పొందారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందగానే ఆశ్చర్యపోయానని, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని అన్నారు. మార్చురీలో చిన్న ఉద్యోగం చేసుకునే తనకు ఆహ్వానం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జనవరి 18న నర్హర్‌పూర్ నుంచి బయల్దేరి, అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతానని అన్నారు. అక్కడ నర్హర్‌పూర్ ప్రజల కోసం ప్రార్థించాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయోధ్య నుంచి సంతోషి దుర్గకు ఆహ్వానం అందడంపై నర్హర్‌పూర్ బీఎమ్‌ఓ ప్రశాంత్ కుమార్ సింగ్ అభినందించారు. ఆమెకు ఆహ్వానం అందడం గర్వకారణం అన్నారు.
కాగా అయోధ్య ప్రాణ ప్రతిష్టకు పౌర పురస్కార గ్రహీతలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, రామ మందిర ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానితుల్లో ఉన్నారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రామాలయ ఉద్యమంలో పాల్గొన్న నాయకుల బంధువులు, మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు, న్యాయవాదుల బృందం, హిందూ సాధువులు, నేపాల్‌లోని సెయింట్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ వ్యక్తులు, జైన, బౌద్ధ మతాలకు చెందిన వ్యక్తులు, సిక్కు కమ్యూనిటీలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానెళ్లకు చెందిన ప్రముఖ వ్యక్తులు, నోబెల్ బహుమతి, భారతరత్న, పరమవీర చక్ర, పద్మ అవార్డులు వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు, ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, త్రిదళ విశ్రాంత అధిపతులు, మాజీ రాయబారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, మేధావులు, క్రీడాకారులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.