ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 18: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అడవుల్లో సోమవారం సాయంత్రం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిలింగం బుధవారం (ఏప్రిల్ 17) మీడియాకువెల్లడించారు. మృతుల్లో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు. కాంకేర్ అడవుల్లో సమావేశం అయ్యారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పేరిట నిర్వహించారు.
ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఏకే-47లు, కార్బైన్, 303 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇన్‌సాస్ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు. బస్తర్ రేంజ్‌లో జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇదేనని ఆయన అన్నారు. ఈ ఎదురు కాల్పుల్లో మరి కొందరు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్‌రావు ఉన్నట్లు తొలుత భావించారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్‌గా గుర్తించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది మృతుల పేర్లను మీడియాకు వెల్లడించారు. మిగతా వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.