అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసీసీ) జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరికి ఇద్దరు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మాత్రమే పోటీలో మిగిలారు. ముగ్గురు నాయకులు అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీ కోసం నామినేషన్లు వేయగా.. వీరిలో జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కెఎన్.త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఇద్దరు నాయకులు పోటీలో నిలిచారు. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లో ఎవరో ఒకరు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. అయితే మల్లికార్జున్ ఖర్గేకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, దళిత వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు కలిసొచ్చే అంశమనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఈక్రమంలో శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని అన్నారు. ఇదే సమయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేశారు. మల్లికార్జున ఖర్గే ను ఉద్దేశించి పార్టీలో ఆయన పనిపట్ల సంతృప్తి ఉంటే ఖర్గె సార్ కు ఓటేయ్యండి.. మీరు మార్పు కోరుకుంటే నేను పోటీలో ఉన్నాను అంటూ వ్యాఖ్యానించారు. అయితే సైద్ధాంతికపరమైన సమస్య లేదని, ఇద్దరిది ఒకే సిద్ధాంతమని అర్ధం వచ్చేలా చెప్పారు. దీంతో మల్లికార్జున్ ఖర్గేపై ప్రత్యక్షంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో మార్పు కోరుకునే వారంతా తనకు ఓటేయాలని పార్టీలో ఓటు హక్కు ఉన్న నాయకులను శశిధరూర్ కోరారు. సాధారణ కార్యకర్తలు తనను ఎన్నికల్లో పోటీచేయాలని కోరారని, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీలో మార్పుకు తాను వాయిస్ కావాలనుకుంటున్నానని శశిథరూర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం మరే పార్టీలో లేదని అన్నారు శశిథరూర్. ఎన్నికలు పార్టీకి మంచివంటూ తాను ఓ కథనం రాశానని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తలు చాలామంది తనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పారన్నారు. ఆ తర్వాత తాను ఆలోచించడంతో పాటు, ఎంతో మందితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని, పార్టీ బలోపేతంతో పాటు.. పార్టీలో జరిగే మార్పులకు తాను గొంతుకగా మారాలని ప్రజలు చాలామంది కోరుకుంటున్నారనే విషయం వెల్లడైందన్నారు.
ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే కాంగ్రెస్ లో గాంధీ కుటుంబం పాత్ర గురించి శశిథరూర్ ను అడిగినప్పుడు ఆయన ఆచీతూచీ స్పందించారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ ఒకటేనని, గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వేరు చేయడానికి అధ్యక్షులు ఎవరైనా అంత మూర్ఖంగా ఆలోచించరని, వారంత మూర్ఖులు కారని అన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆస్తి అంటూ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా.. అక్టోబర్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి 19వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటించనున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఖర్గే వర్సెస్ థరూర్ అన్నట్లుగా మారాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఈ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నిలవడంతో ఎవరూ అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఇద్దరు మాత్రమే పోటీలో ఉండటంతో ఎన్నిక లేకుండా ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు. ఇద్దరిలో ఎవరు అధ్యక్షులు అయినా గాంధీయేతర కుటుంబానికి చెందిన వారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులే కావడంతో ఎన్నిక లేకుండా అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్లాన్ లో హస్తం పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసేవరకు రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటూనే వచ్చింది. మొదట్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షులు అవుతారనే ప్రచారం జరిగింది. చివరికి తాను పోటీలోనే ఉండటం లేదంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ కు అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. చివరికి మల్లికార్జున ఖర్గే పోటీలో ఉన్నానంటూ నామినేషన్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన బయటపడింది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో ఈలోపు ఈ అధ్యక్ష ఎన్నికల రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..