Bumble Bee Bite: మాయదారి కందిరీగ.. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఎయిర్ ఫోర్స్ అధికారి మృతి!
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంబుల్ బీ (పూల మొక్కలపై ఉండే ఒకరకమైన కందిరీగ) కాటుకు గురై వైమానిక దళ అధికారి మరణించారు. ఎయిర్ ఫోర్స్ అధికారి రంజిత్ కుమార్ చండీగఢ్‌లోని ఎయిర్‌ఫోర్స్‌లో మాస్టర్ వారెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితమే సెలవుపై ఇంటికి వచ్చారు. అహియాపూర్‌లోని ద్రోన్‌పూర్‌లోని తన పూర్వీకుల ఇంటికి వెళ్లిన అతను..
ముజఫర్‌పూర్, జనవరి 10: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంబుల్ బీ (పూల మొక్కలపై ఉండే ఒకరకమైన కందిరీగ) కాటుకు గురై వైమానిక దళ అధికారి మరణించారు. ఎయిర్ ఫోర్స్ అధికారి రంజిత్ కుమార్ చండీగఢ్‌లోని ఎయిర్‌ఫోర్స్‌లో మాస్టర్ వారెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితమే సెలవుపై ఇంటికి వచ్చారు. అహియాపూర్‌లోని ద్రోన్‌పూర్‌లోని తన పూర్వీకుల ఇంటికి వెళ్లిన అతను.. అనూహ్యంగా కందిరీగ కాటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన వైమానిక దళ అధికారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు SKMCHకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. వివరాల్లోకెళ్తే..
ఎయిర్ ఫోర్స్ అధికారి రంజిత్ కుమార్ డ్రోన్‌పూర్ తమ గ్రామంలోని ఇంటి బయట కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఆయన మనవడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా కందిరీగల గుంపు వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన మనవడిని ఎలాగోలా కాపాడి ఇంట్లోకి తీసుకెళ్లారు. అయితే రంజిత్ కుమార్ మాత్రం వాటి దాడి నుంచి తప్పించుకోలేకపోయారు. అకస్మాత్తుగా బంబుల్బీ కందిరీగల సమూహం అతని శరీరాన్ని చుట్టుముట్టింది. బంబుల్బీ కందిరీగలు ఆయన ముఖం, చేతులు, కాళ్లు ఇతర బహిర్గత భాగాలపై విపరీతంగా దాడి చేసి, గాయపరిచాయి. దీంతో ఆయన అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం శ్రీకృష్ణా మెడికల్ ఆస్పత్రికి తరగలించారు.
అక్కడి వైద్యులు పరీక్షించి, ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఎస్‌కేఎంసీహెచ్ ఓపీ ఇన్‌చార్జి ఆదిత్యకుమార్‌కు సమాచారం అందించగా.. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌కేఎంసిహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. బంబుల్‌బీల గుంపు దాడి ఘటనతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్ రంజిత్ కుమార్ బంబుల్బీ కందిరీగల దాడిలో మృతి చెందిన తర్వాత.. ఆ గ్రామంలో భయానక వాతావరణం చోటు చేసుకుంది. భయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడం మానేశారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లాలంటేనే భయంతో గజగజలాడిపోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.