
గుజరాత్‌లోని దాహోద్‌లో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. స్మార్ట్‌సిటీలో భాగంగా దాహోద్ పట్టణంలోని మసీదు, దర్గాలతో సహా నాలుగు పురాతన ఆలయాలను కూల్చివేసింది ప్రభుత్వం. ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రఖ్యాత నగీనా మసీదులోని కొంత భాగాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు కూల్చివేతను నిరసిస్తూ ఓ వర్గం వారు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఐతే మసీదుకు సంబంధించిన భూమి రికార్డు పత్రాలను సమర్పించడంలో ట్రస్టు విఫలమైంది. దాంతో స్మార్ట్‌సిటీ రహదారి విస్తరణ ప్రాజెక్టు కింద అధికారులు కూల్చివేశారు. మసీదు కూల్చివేత జరిగిన కొన్ని గంటల తర్వాత నాలుగు దేవాలయాలు, మరో మూడు దర్గాలను కూడా అధికారులు కూల్చివేశారు.
మసీదు, దేవాలయాల కూల్చివేతలో భాగంగా రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 450 మంది పోలీసులు మోహరించారు. అంతేకాదు ఆ ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించారు. దాంతో శాంతియుత వాతావరణంలో కూల్చివేతలు కొనసాగాయి. మసీదుకు సంబంధించిన భూ రికార్డులను పరిశీలించేందుకు ట్రస్ట్ శుక్రవారం వరకు సమయం కోరింది. ఐతే మసీదు ట్రస్ట్ ఎలాంటి అసలైన రికార్డులు చూపించలేదని జిల్లా అధికారులు తెలిపారు. దాంతో స్థలాన్ని ఖాళీ చేయాలని మసీదు ట్రస్టును కోరడంతో వారు దానికి అంగీకరించారన్నారు.
గుజరాత్ మునిసిపాలిటీల చట్టం కింద ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ సమీపంలోని దుకాణాలకు ముందుగానే నోటీసులు జారీ చేశారు స్థానిక అధికారులు. అయితే వాటిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. భవిష్యత్ తరాలకోసం రోడ్డు విస్తరణ ఎంతో కీలకమని న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో దుకాణాలు, కొన్ని ఇళ్లను కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలతో స్థానిక అధికారులకు తాము సహకరించి, తమ వస్తువులను శుక్రవారం మధ్యాహ్నంలోపు తొలగించామని మసీదు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం