Centre govt. ban on single-use Plastic: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర సర్కార్ నిషేధించింది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను శుక్రవారం జారీ చేసింది. దీంతో 2020 జూలై 1 నుంచి ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులైన స్ట్రాస్, ప్లేట్లు, కప్పులు, ట్రేలు, పాలీస్టైరిన్, క్యారీ బ్యాగ్స్ వంటి వాటి తయారీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిలిచిపోనున్నాయి.
ఉపయోగం తక్కువగా ఉంటూ, చెత్తగా పోగుపడే అవకాశం అధికంగా ఉన్న వస్తువుల తయారీ, నిల్వ, దిగుమతి, పంపిణీ, అమ్మకం, వినియోగాలపై విధించిన ఈ నిషేధం 2022 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీని ప్రకారం 2022 జూలై 1 నుంచి కొన్ని రకాల వస్తువులపై నిషేధం అమలవుతుంది. ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్‌బడ్స్, బెలూన్స్‌కు ఉండే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్ కోసం ఉపయోగించే పాలీస్టైరీన్, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెమ్చాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్స్‌ల ర్యాపింగ్, ప్యాకింగ్ ఫిలింస్, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బ్యానర్లు వంటివాటిపై ఈ నిషేధం అమలవుతుంది.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 2021 సెప్టెంబరు 30 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం 50 మైక్రాన్ల నుంచి 75 మైక్రాన్లకు, 120 మైక్రాన్లకు పెంచుతారు. ఇవి దళసరిగా ఉంటాయి కాబట్టి వీటిని, మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికి అనుమతి ఇస్తారు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలను పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ ఓనర్స్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016 ప్రకారం సేకరించి, నిర్వహిస్తారు.
అయితే, కంపోస్టబుల్ ప్లాస్టిక్‌తో చేసిన బ్యాగ్‌లకు ఈ మందం మార్గదర్శకాలు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. వీటి తయారీదారులు లేదా వాటిని ఉపయోగించే బ్రాండ్ యజమానులు వాటిని విక్రయించడానికి లేదా ఉపయోగించడానికి ముందు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని పేర్కొంది.
మరోవైపు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణకు బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాల విభజన, సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, సరైన విధంగా పారవేయడాన్ని స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని తెలిపింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణ నియమాలపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read Also… Big News Big Debate: దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం.. లైవ్ వీడియో