Nupur Sharma: ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..

Nupur Sharma: మహ్మద్‌ప్రవక్తపై నూపుర్‌ శర్మ అనుచిత వ్యాఖ్యలు వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాళ్లపై..

Nupur Sharma: ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..
Nupur Sharma

Updated on: Jun 10, 2022 | 9:38 AM

Nupur Sharma: మహ్మద్‌ప్రవక్తపై నూపుర్‌ శర్మ అనుచిత వ్యాఖ్యలు వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాళ్లపై కేంద్రం కఠినచర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలో నూపుర్‌శర్మతో పాటు ఆమెకు కౌంటర్‌గా వ్యాఖ్యలు చేసిన వాళ్లపై కూడా కేసులు నమోదయ్యాయి. మజ్లిస్‌ ఎంపీ అసుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ బహిష్కృత నేత నవీన్‌జిందాల్‌పై తాజాగా కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో మజ్లిస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ పార్టీ అధినేత ఒవైసీపై ఎఫ్‌ఐఆర్‌, మహ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌శర్మ వ్యాఖ్యలపై మజ్లిస్‌ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆందోళన చేస్తున్న మజ్లిస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఒవైసీపై ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ కేసు నమోదు చేసింది. ఢిల్లీలో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. స్వామి యతి నరసింహానంద్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. మొత్తం 10 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది స్పెషల్‌ సెల్‌. ఏ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారో తెలియదన్నారు ఒవైసీ. కేసులకు భయపడేది లేదన్నారు.

నూపుర్ శర్మ వ్యాఖ్యలతో సంబంధం లేదు..
నూపుర్‌శర్మ వ్యాఖ్యలతో కేంద్రానికి సంబంధం లేదని విదేశాంగశాఖ మరోసారి వివరణ ఇచ్చింది. విదేశాంగ శాఖ చేసే ప్రకటనలనే అంతర్జాతీయ దేశాలు గుర్తించాలని, ప్రైవేట్‌ వ్యక్తల వ్యాఖ్యలతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి. ‘‘ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ప్రభుత్వ అభిప్రాయం కాదు. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలపై సంబంధిత అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు.

అయితే నూపుర్‌శర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ముస్లిం సంస్థలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బెంగాల్‌లో పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. నూపుర్‌శర్మ ఫోటోలను తగులబెట్టారు ఆందోళనకారులు. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతలు చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారన్నారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. నూపుర్‌శర్మను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.