అయోధ్యలోని రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఆలయ నిర్మాణ పనులు 2024 జనవరి 1 నాటికి పూర్తవుతాయని ప్రకటించిన అమిత్ షా మందిర ప్రారంభోత్సవ వేడుకలు కూడా అదే రోజున జరుగుతాయని పేర్కొన్నారు. గురువారం త్రిపురలోని ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. ఈ మహత్తరమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ రామ మందిర నిర్మాణ కేసును కోర్టుల్లో అడ్డుకుంటున్నదని, ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని ఆయన కాంగ్రెస్‌పై కూడా విరుచుకుపడ్డారు.
త్రిపురలోని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా ‘ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రామ మందిర సమస్యను కాంగ్రెస్ అడ్డుకుంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం ప్రధాని మోదీ ఆగస్టు 5, 2020న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం ప్రారంభమైంది’ అని అన్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2024లోనే జరగనున్నాయి. దాదాపు ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న ఎన్నికలలో కూడా తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రామ మందిరంపై అమిత్ షా చేసిన ప్రకటన బీజేపీకి ఎంతో బలాన్ని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
ఇక తాజా ప్రణాళిక ప్రకారం రామ మందిరం పరిసరాల్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి, కేవట్, శబరి, జటాయువు, సీత, విఘ్నేశ్వరుడు (గణేష్), శేషావతార్ (లక్ష్మణుడు) ఆలయాలను కూడా నిర్మించనుంది ఆలయ ట్రస్ట్. ఆలయ విస్తీర్ణం, దాని ప్రాంగణంతో సహా మొత్తం ఎనిమిది ఎకరాల భూమిని కలుపుతూ దీర్ఘచతురస్రాకారంలో రెండు అంతస్తుల ప్రదక్షిన దారిని కూడా నిర్మించనున్నారు. దాని తూర్పు భాగంలో ఇసుకరాయితో చేసిన ప్రవేశ ద్వారం ఉంటుంది. రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుండి తెల్లటి పాలరాయిని ఆలయ గర్భగుడి లోపల ఉపయోగించనున్నారు.