Business News: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుంచి డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ళ లైసెన్స్..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని డీటీహెచ్ సంస్థలకు సంబంధించిన లైసెన్స్ కాలానికి ఉన్న నిబంధలను సవరించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని డీటీహెచ్ సంస్థలకు సంబంధించిన లైసెన్స్ కాలానికి ఉన్న నిబంధలను సవరించింది. అటు డీటీహెచ్ సేవలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వీలుగా వాటికి 20 సంవత్సరాలకు లైసెన్స్ మంజూరు చేసేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా డీటీహెచ్ బ్రాడ్ కాస్టింగ్ రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం వీటికి సంబంధించిన సమావేశం నిర్ణయించింది.
దేశంలో ఇప్పటికే సుమారు 6 కోట్లకు పైగా ఇళ్ళకు ఈ డీటీహెచ్ సేవలు అందుతుండగా.. ఈ రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించాలని ముందుగా నిర్ణయించింది. కానీ సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంతో ఇంతవరకు లభించలేదు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు వాణిజ్య శాఖకు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుతం సమాచార, ప్రసార శాఖ నిబంధల ప్రకారం 49 శాతం ఎఫ్డీఐకే అనుమతి ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జయదేకర్ అన్నారు. డీటీహెచ్ సంస్థలకు 20 సంవత్సరాలకు లైసెన్స్ మంజూరు చేస్తామని, ఆ తర్వాత నుంచి ప్రతి పది సంవత్సరాలకు వాటిని పునరుద్దరించుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు లైసెన్స్ ఫీజును సంవత్సరానికొకసారి వసూలు చేస్తుండగా.. ఇక నుంచి ప్రతీ మూడు నెలలకొకసారి వసూలు చేస్తామన్నారు. ఎఫ్డీఐ నిబంధనల సవరణలతో డీటీహెచ్ రంగంలో మరింత బలపడుతుందని, అంతేకాకుండా ఇందులోకి విదేశీ పెట్టుబడులు రావడంతోపాటు, మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
కొత్త నిబంధన ప్రకారం డీటీహెచ్ లైసెన్స్ ఫీజును సంవత్సర ఆదాయంలో 10 శాతం కాకుండా 8 శాతంగా మార్పు చేయనున్నారు. ఈ నిబంధనలతో టెలీకాం శాఖలాగే లైసెన్స్ ఫీజు ఉంటుంది. డీటీహెచ్ ఆపరేటర్లు స్వయంగా డీటీహెచ్ సంస్థలు, టీవీ ఛానళ్ళ ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్లను తీసుకోవచ్చు. అంతేకాకుండా టీవీ ఛానళ్ళ పంపిణీదారులు తమ సబ్ స్కైబర్ మేనేజ్మెంట్ సిస్టం, కండీషనల్ యాక్సెస్ సిస్టమ్ అప్లికేషన్ల కోసం సంయుక్తంగా హార్డ్ వేర్ను తీసుకోవడానికి అనుమతి ఉంటుందని, ఇలా చేయడం వలన శాటిలైట్ వనరులను మరింతగా బలపడుందని సమాచార శాఖ ప్రకటించింది.