Karnataka: పహల్గామ్ ఉగ్రదాడిని సమర్థిస్తూ పోస్ట్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్!
పహల్గామ్ ఉగ్రదాడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కర్ణాటకకు చెందిన ఓ ఫేస్‌బుక్ యూజర్ పహల్గామ్ ఉగ్రదాడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉగ్రదాని నేపథ్యంలో అల్లర్లు చెలరేగేలా పోస్ట్ పెట్టారనే మంగళూరులోని ఉల్లాల్ ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రమూకలు చేసిన మారణహోమం దేశాన్ని తీవ్రంగా కలిచి వేసింది. ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్లిన అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారు ముష్కరులు. ఇప్పుడు ఈ విషాద ఘటనపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఓ వైపు అమాయక పౌరుల ప్రాణాలు తీసిని ఉగ్రవాదులను చంపేయాలని యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. కొందరు దుర్మార్గులు మాత్రం ఈ ఉగ్రదాడిని సమర్థిస్తూ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. తాజాగా ఉగ్రదాడిని సమర్థిస్తూ మాట్లాడిన ఓ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇలాంటి మరో ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. పహల్గామ్ దాడిని సమర్థిస్తూ పోస్ట్ పెట్టిన ‘నిచ్చు మంగళూరు’ అనే ఫేస్‌బుక్ వినియోగదారుపై కేసు నమోదైంది.
మంగళూరులోని ఉల్లాల్ ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఆ ఫేస్ బుక్ వినియోగదారుడిపై కోనాజే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉగ్రదాడి నేపథ్యంలో అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో పోస్ట్‌లు పెట్టాడని, సోషల్ మీడియా ద్వారా అశాంతిని కలిగించే ప్రకటనలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలో ఫేస్‌బుక్ వినియోగదారుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం సెక్షన్లు 192, 353(1)(b) కింద అభియోగాలు మోపారు.
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 28 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పచ్చని ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులను ఆ ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నారు. చంపొద్దు అని వేడుకున్నా వదలలేదు. ఈ ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని స్పష్టం చేసింది. దీనికి త్వరలోనే సమాధానం చెప్పేందుకు ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే పాక్‌పై ప్రతికార చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధం ప్రారంభించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
