Viral: దగ్గినప్పుడల్లా రక్తం.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్ రే తీసి స్టన్ అయిన వైద్యులు
అతనికి దగ్గు, జ్వరం ఉండటంతో టీబీగా భావించారు వైద్యులు. టీబీ చికిత్సలో భాగంగా 9 నెలల కోర్సు కూడా పూర్తి చేశాడు బాధితుడు. అయితే అతని పరిస్థితి మెరుగుపడకపోగా.. మరింత దిగజారింది. ఇటీవల ఏకంగా దగ్గు వచ్చినప్పుడు రక్తం పడటం ప్రారంభమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ...

అది ఒడిశాలోని బెర్హంపూర్. అక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. 24 ఏళ్ల యువకుడికి దగ్గులో రక్తం పడుతూ ఉండటంతో.. ఏప్రిల్ 19న అతని కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకుని వచ్చారు. దీంతో అతనికి పలు టెస్టులు చేశారు అక్కడి డాక్టర్లు. ఎక్స్ రే తీయగా అతని శరీరంలో ఏదో వస్తువు ఉన్నట్లు వెల్లడైంది. మరింత స్పష్టత కోసం.. CT స్కాన్, బ్రోంకోస్కోపీ చేయగా.. అతని కుడి ఊపిరితిత్తులో ఒక కత్తి ముక్క ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల బృందం థొరాకోటమీ ఆపరేషన్ చేసి అతని ఊపిరితిత్తి నుంచి విజయవంతంగా ఎనిమిది సెంటీమీటర్ల పొడవున్న విరిగిన కత్తి ముక్కను తొలగించింది. ఆ కత్తి ముక్క వెడల్పు 2.5 సెం.మీ, మందం 3 మి.మీ ఉందని చెప్పారు. రోగి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో పరిశీలనలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు.
మూడు సంవత్సరాల క్రితం బెంగళూరులో కూలీగా పనిచేస్తున్నప్పుడు ఒక దుండగుడు ఈ యువకుడ్ని కత్తితో పొడిచాడు. అప్పుడు కత్తి ముక్క అతని శరీరంలోకి ప్రవేశించింది. అతని ఎడమ వైపు మెడలో కత్తి దిగింది. ఆ సమయంలో బాధిత యువకుడు బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. అప్పుడు కేవలం గాయానికి ట్రీట్మెంట్ చేసి పంపారు అక్కడి డాక్టర్లు. అతని లోపలకి కత్తి దిగిన విషయాన్ని గుర్తించలేదు. ఆ తర్వాత ఆ యువకుడు రికవర్ అవ్వడంతో.. తన పనుల్లో నిమగ్నపోయాడు. రెండేళ్ల పాటు ఎలాంటి సమస్యా రాలేదు.
దాదాపు ఒక సంవత్సరం క్రితం, అతను పొడి దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు. దీంతో టీబీ వచ్చిందేమో అనుకున్నాడు. టీబీకి గాను తొమ్మిది నెలల చికిత్సను కూడా తీసుకున్నాడు. ఇటీవల దగ్గులో రక్తం రావడంతో.. ఆస్పత్రికి రావడంతో కత్తి ముక్క విషయం వెలుగులోకి వచ్చింది.
ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని CTVS, అనస్థీషియా విభాగాలలోని దాదాపు ఎనిమిది మంది వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారా-మెడికల్ సిబ్బంది శస్త్రచికిత్స నిర్వహించి పదునైన లోహపు ముక్కను తొలగించారు. అయితే ఈ కత్తి ముక్క శరీరంలో అంత లోపలికి వెళ్లినప్పటికీ.. ఏ అవయవానికి డ్యామేజ్ జరగకపోవడం తమకు ఆశ్చర్యపరిచింది అని వైద్యులు చెప్పారు.(Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
