చెన్నై, జనవరి 24: తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. తమ ఇంట్లో పని చేసే వంట మనిషిని పైశాచికంగా హించించిన ఘటనలో ఈ జంటపై కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని పల్లావరం ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివాణన్, కోడలు మెర్లినా ఇంట్లో దళిత యువతి పని మనిషిగా చేస్తోంది. వారు తనపై శారీరకంగా దాడి చేసి, వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జీతం కూడా చెల్లించేవారు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా భోజనం వండేందుకు సమయానికి నిద్రలేవలేదని దంపతులిద్దరూ తనపై హెయిర్ స్ట్రైయిట్‌నర్‌తో తన చేతిని కాల్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. సంక్రాంతి సందర్భంగా యువతి తన ఇంటికి రావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమె శరీరంపై గాయాలు ఉండటం చూసిన యువతి తల్లిదండ్రులు ఆరా తీయడం ఆ దారుణం వెలుగు చూసింది. వెంటనే ఆమెను ఉలందూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
నీలాంగరై ఆల్ ఉమెన్ పోలీసులు ఎమ్మెల్యే కొడుకు, కోడలిపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటినుంచి వారిద్దరూ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడి గాలింపు చర్యలకు పూనుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ఆరు రోజులైంది. ఇద్దరూ సైదాపేట కోర్టులో ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు సమాచారం. నన్ను ఎమ్మెల్యే కొడుకు, అతని భార్య ఆరు నెలల క్రితం పనిలో చేర్పించుకున్నారు. వారు నాపై శారీరకంగా దాడి చేయని రోజు లేదు. నా శరీరం నిండా గాయాల గుర్తులు ఉన్నాయి. వాళ్లు నాతో ఎప్పుడూ సరిగ్గా ప్రవర్తించలేదు. అక్కడ పనిచేయడం ఇష్టం లేదని చెప్పడంతో నాతల్లి, సోదరుడిని చంపేస్తామని బెదిరించారు. నన్ను తెల్లవారుజామున 2 గంటలకు నిద్రకు పంపించేవారు. మళ్లీ ఉదయం 6 గంటలకు లేవాలని ఒత్తిడి చేసేవారు. వారితో పాటు ముంబయి వెళ్లినప్పుడు సరిగ్గా వంట చేయలేదని దాడిచేశారు. పచ్చి మిరపకాయ తినిపించి హింసించారు. వాతలు పెట్టి రక్తం కారేలా కొట్టేవారు. నన్ను మానసికంగా వేధించారని యువతి ఆరోపించింది. తన చదువు కోసం డబ్బులు సంపాదించడం కోసమే ఇంటి పనిలో చేరాల్సి వచ్చిందని, ఎమ్మెల్యే కుటుంబం తనకు జీతం కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.
అయితే కరుణానిధి తన కొడుకు, కోడలుపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన కొడుకు, కోడలు గత ఏడేళ్లుగా వేరువేరుగా జీవిస్తున్నారని కరుణానిధి చెప్పుకొచ్చాడు. యువతిని తాము బాగా చూసుకున్నామని, ఎవరో కుట్ర పూరితంగా తన కుటుంబంపై ఆరోపణలు లేవనెత్తుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.