దేశంలో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మరో రాష్ట్రంలో సందడి మొదలవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే ఏదో ఒక రాష్ట్రంలో లోక్‌సభ లేదా అసెంబ్లీలకు జరిగే ఉపఎన్నికలు సైతం యావత్ రాష్ట్రం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అధికార విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. తాజాగా హర్యానా, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఫలితాలు కూడా వెల్లడికాలేదు.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వీటికి తోడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు సైతం త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఓ ఎమ్మెల్యే క్రిమినల్ కేసులో దోషిగా తేలి శిక్షకు గురికావడంతో పదవి కోల్పోగా ఖాళీ ఏర్పడితే, మిగతా 9 స్థానాల్లో ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందిన కారణంగా ఎమ్మెల్యే పదవులను వదులుకోవాల్సి వచ్చింది.
కతేహరి (అంబేద్కర్ నగర్), కర్హల్ (మెయిన్‌పురి), మిల్కీపూర్ (అయోధ్య), మీరాపూర్ (ముజఫర్‌నగర్), ఘజియాబాద్, మజ్హవాన్ (మీర్జాపూర్), సిషామౌ (కాన్పూర్ నగరం), ఖైర్ (అలీఘర్), ఫుల్పూర్ ( ప్రయాగ్‌రాజ్) మరియు కుందర్కి (మొరాదాబాద్) స్థానాలకు త్వరలో ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు కూడా పూర్తి చేసింది. ఉపఎన్నికలు జరగనున్న ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిషామౌ, కతేహరి, కర్హల్, మిల్కీపూర్, కుందర్కీ సీట్లను సమాజ్‌వాదీ పార్టీ (SP) గెలుచుకోగా, ఫూల్పూర్, ఘాజియాబాద్, మజ్హవాన్, ఖైర్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. మీరాపూర్ స్థానంలో రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) గెలిచింది.
వీటిలో కాన్పూర్ నగరంలోని సిషామౌ ఎమ్మెల్యేగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (SP) నేత ఇర్ఫాన్ సోలంకి ఓ క్రిమినల్ కేసులో శిక్షకు గురవడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది. కర్హల్ ఎమ్మెల్యేగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. అలాగే కతేహారి ఎమ్మెల్యేగా ఉన్న ఆ పార్టీ నేత లాల్జీ వర్మ అంబేద్కర్ నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇదే పార్టీకి చెందిన మిల్కీపూర్ ఎమ్మెల్యే అవధేశ్ ప్రసాద్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీని ఓడించి యావద్దేశం దృష్టిని ఆకట్టుకున్నారు. మరో ఎస్పీ ఎమ్మెల్యే (కుందర్కీ) జియా-ఉర్-రెహమాన్ బర్ఖ్ సంభల్ నుంచి ఎంపీగా గెలుపొందారు. వీరంతా తమ ఎమ్మెల్యే పదవులను వదులుకోవడంతో ఖాళీలు ఏర్పడ్డాయి.
బిజ్నోర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్(RLD)కు చెందిన చందన్ చౌహాన్ ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఘజియాబాద్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా అతుల్ గార్గ్ ఎన్నికవడంతో ఘజియాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. మజాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న వినోద్ కుమార్ బింద్ (బీజేపీ) భాదోహి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే పార్టీకి చెందిన అనూప్ సింగ్ అలియాస్ అనూప్ ప్రధాన్ బాల్మీకి హత్రాస్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికైన తరువాత అలీఘర్‌లోని ఖైర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. కమలదళానికే చెందిన ప్రవీణ్ పటేల్ ఫూల్‌పూర్ ఎమ్మెల్యే నుంచి ఫూల్‌పూర్ ఎంపీగా గెలుపొందడంతో ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది.
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి ఎదురుదెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ కీలకం. ఈ కారణంగా ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించలేక తమ సారథ్యంలోని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ కూటమిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక్కడ విపక్ష కూటమి (I.N.D.I.A)లోని సమాజ్‌వాదీ పార్టీ (SP) – కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్లు, రాజ్యాంగం పేరుతో బీజేపీకి కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఇప్పటికే హర్యానా, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇండి కూటమిదే అధికారం అంటూ అనేక ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ ఊపులో ఉన్న విపక్ష కూటమి యూపీ ఉపఎన్నికల్లో కమలదళానికి కోలుకోలేని దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. హర్యానా, జమ్ము కాశ్మీర్ పరాభవానికి యూపీ ఉపఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుని ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో కాషాయదళం పనిచేస్తోంది. దీంతో రెండు కూటములకు ఈ ఉపఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న విషయాల కంటే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారు అన్న ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. అది ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సత్ఫలితాలనిచ్చింది. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లోనూ ఇదే నినాదాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘సంవిధాన్ బచావో సమ్మేళన్’ (రాజ్యాంగాన్ని కాపాడే సదస్సులు) పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. పది అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 2 చోట్ల సదస్సులు నిర్వహించామని, మిగతా 8 చోట్ల కూడా నిర్వహిస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు.
కూటమిలో భాగంగా పొత్తు ధర్మం పాటిస్తూ సమాజ్‌వాదీతో కలిసి ఉపఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు రాయ్ చెప్పారు. అయితే ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య పొత్తుల బేరం కొలిక్కి రాలేదు. 10 స్థానాలకు 5 చోట్ల పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇది సమాజ్‌వాదీ పార్టీకి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పాటించిన నిష్పత్తి ప్రకారమే ఈ 10 స్థానాలను పంచుకోవాలని ఎస్పీ భావిస్తోంది. ఈ విషయంపై ఆ పార్టీ నేతలను ప్రశ్నించినప్పుడు.. తమ ఉమ్మడి లక్ష్యం బీజేపీని ఓడించడమేనని, ఆ విషయంలో రాజీ పడబోమని చెబుతున్నారు. పొత్తుల లెక్కలు తేల్చుకోడానికి రెండు పార్టీల నేతలు కూర్చుని నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఏదైమైనా కలిసి పోటీ చేయడం పక్కా అని స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్న కమలదళం మళ్లీ ఆ తప్పులు పునరావృతం చేయకుండా వీలుంటే అన్ని స్థానాలు గెలుచుకుని సత్తా చాటాలని చూస్తోంది. నిజానికి 10లో బీజేపీ సీట్లు 4 మాత్రమే. తమ సీట్లు తాము నిలబెట్టుకోవడంతో పాటు మిగతా సీట్లను గెలిస్తేనే మిగతా రాష్ట్రాల్లో ఓటమి పరాభవాన్ని కొంతైనా దిగమింగుకోవచ్చని భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..